ఈ రోజుల్లో గడ్డం ఫ్యాషన్. గడ్డం ఉంటేనే మ్యాన్లీ లుక్ ఉంటుందనేది అబ్బాయిల నమ్మకం. అంతేకాదు, అమ్మాయిలు కూడా గడ్డం ఉన్న కుర్రాళ్లకే అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో అబ్బాయిలు గుబురు గడ్డంతోనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మన దేశంలో ఎక్కడైనా గడ్డం Okay. కానీ, గుజరాత్‌లోని ఆ గ్రామంలో మాత్రం Not Okay!
గుజరాత్‌లోని పాలి జిల్లాలో పెద్దలంతా కలిసి ఒక కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై తమ ఊర్లలో జరిగే పెళ్లిల్లలో వరుడు తప్పకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలనే రూల్ పెట్టారు. పెళ్లి కొడుకు గడ్డంతో ఉంటే పెళ్లికి అనుమతి ఇవ్వబోమని తేల్చేశారు. అంతేకాదు, పెళ్లిలో డీజేలు, డ్యాన్సులంటూ చిందులేస్తే సహించబోమని కూడా చెప్పేశారు. 19 గ్రామాలకు చెందిన కుమావత్ కమ్యునిటీ పెద్దలంతా కూర్చొని ఈ రూల్స్ రూపొందించారు.
‘‘పెళ్లిలో ఫ్యాషన్ ఒకే. కానీ, ఫ్యాషన్ పేరుతో వరుడు గడ్డంతో పెళ్లి చేసుకుంటే మాత్రం అంగీకరించం. పెళ్లి అనేది మత సంప్రాదాయానికి ప్రతీక. వరుడిని రాజులా చూస్తారు. అందుకే, అతడు గడ్డంతో కాకుండా క్లీన్ షేవ్‌తో చక్కగా కనిపించాలి’’ అని పెద్దలు రూపొందించిన తీర్మానంలో పేర్కొన్నారు. పెళ్లి కోసం భారీ ఖర్చు పెట్టకూడదని, తక్కువ ఖర్చుతోనే పెళ్లి చేయాలని పెద్దలు వెల్లడించారు. డీజే డ్యాన్సులు కూడా చేయొద్దని వెల్లడించారు.
Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!
ఎవరైనా ఫ్యాషన్ పేరుతో థీమ్ ప్రకారం డెకరేషన్లు చేసినా, దుస్తులు, హల్దీ వేడుకలంటూ విపరీతంగా ఖర్చు చేసినా జరిమానా విధిస్తారు. పాలీ జిల్లాలోని ప్రతి గ్రామ ప్రజలు ఈ నిబంధన పాటించాలి. పాలీలోని 19 గ్రామాల నుంచి గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్లిన గ్రామస్తులు కూడా ఈ నిబంధనలు పాటించాలని నిబంధనల్లో పేర్కొన్నారు.