కేంద్ర బడ్జెట్‌-2022 ఎట్టకేలకు ప్రవేశపెట్టారు. అయితే, మిడిల్ క్లాస్.. వేతన జీవులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం లభించలేదు. పైగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నవారిపై కేంద్రం కన్నేసింది. వారి లాభాల్లో 30 శాతాన్ని కేంద్రానికి చెల్లించాలే కండీషన్ పెట్టింది. మరోవైపు డిజిటల్‌ ఎకానమీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మరో కీలక ప్రకటన కూడా చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు నేతృత్వంలో బ్లాక్‌చైన్‌ సాంకేతికతో డిజిటల్‌ రూపాయిని తీసుకొస్తామని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్‌ రూపాయిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది క్రిప్టో కరెన్సీకి పోటీగా తెస్తున్నారా లేదా అన్నదే ఇంకా తెలియాల్సి ఉంది.


ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం కూడా నిరుత్సాహానికి గురిచేసింది. కొత్తగా ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. పాతవాటినే యథాతథంగా కొనసాగిస్తున్నారు. అయితే, సర్‌ఛార్జ్‌ హేతుబద్ధీకరణ కొనసాగిస్తామంటూ పన్ను చెల్లింపు దారులకు కాస్త ఊరట కల్పించారు. ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా మార్చుకొనేందుకు రెండేళ్ల సమయం ఇచ్చారు. అంటే అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి రెండేళ్ల వరకు అన్నమాట. అయితే, కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను వసూలు చేస్తామని చెప్పడం నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూస్తే మీరు తప్పకుండా నవ్వేస్తారు.