Middle Ground Growers | ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు పొలంలోకి దిగి ‘వీకెండ్ వ్యవసాయం’ అనే కాన్సెప్ట్ చూసి అంతా ఈలలు వేశారు. అంతేకాదు.. మన యూత్ కూడా వీకెండ్‌లో పొలాలకు వెళ్లి పనులు చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు దిగుతూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే. ఆ ట్రెండ్ పాతది కావడంతో జనాలకు బోరు కొట్టి.. మళ్లీ అటువైపు అడుగు పెట్టడం లేదు. అయితే, ఈ స్నేహితులు ఆ టైపు కాదు. ఆకలితో అలమటిస్తున్న పేదలను చూసి కరిగిపోయారు. రూ.కోటి పొలాలు కొనుగోలు చేశారు. వ్యవసాయం చేస్తూ.. 600 కుటుంబాల కడుపు నింపుతున్నారు. 


కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది పేదలు ఆహారం కోసం అలమటించారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అలాంటి సమయంలో యూకేకు చెందిన స్నేహితుల బృందం దేవుడి అవతారం ఎత్తారు. లాక్‌డౌన్ సమయంలో వారికి వచ్చిన ఐడియా ఇప్పుడు ఎంతోమంది కడుపు నింపుతోంది. తెలుగులో విడుదలైన ‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్ తరహాలోనే వీరికో కత్తిలాంటి బిజినెస్ ఐడియా వచ్చింది. 


‘మిడిల్ గ్రౌండ్ గ్రోవర్స్’ పేరుతో స్నేహితులంతా కలిసి ‘వెజ్ బాక్స్’ బిజినెస్ ప్రారంభించారు. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా రూ.కోటి వరకు విరాళాలు సేకరించారు. ఆ మొత్తంతో 16 ఎకరాల పొలాలను కొనుగోలు చేశారు. అక్కడ ఆర్గానిక్ కూరగాయలను పండించడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సమయంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల స్థానికంగా చాలామంది పేదలకు ఉపాధి లభించింది. అంతేగాక, ప్రజల నుంచి కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు లభించేవి. ఫలితంగా.. వారి సంస్థకు ఆదాయమే కాకుండా 600 కుటుంబాల ఆకలి తీర్చడంలో సక్సెస్ అయ్యింది. అంతే, ఆ సంస్థ పేరు దేశమంతా మారుమోగింది. 


Also Read: చీమలే దెయ్యాలా? ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. అసలు నిజం వేరే ఉంది!


హమిష్ ఎవాన్స్ జేవియర్ హమోన్, లివి రోడ్స్, సామీ ఎల్మోర్ అనే ముగ్గురు స్నేహితులు ఈ వెజ్ బాక్స్ బిజినెస్ మొదలుపెట్టారు. తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు 2020లో కొన్ని స్థలాలను అద్దెకు తీసుకుని కూరగాయలు పండించేవారు. అయితే, వచ్చే ఆదాయమంతా అద్దెలకు సరిపోతుందనే కారణంతో తమ వద్ద ఉన్న డబ్బుతో పొలాలు కొనుగోలు చేయాలని అనుకున్నారు. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించారు. వారి ఉద్దేశం మంచిది కావడంతో ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేశారు. వీరిలో ఒకరు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం గురించి నేర్చుకున్నారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు సంస్థలో నియమించుకున్నారు. కేవలం కాయగూరలే కాకుండా.. రకరకాల పండ్లను కూడా పండిస్తూ జనాలకు అందిస్తున్నారు. 


Also Read: ఖి‘లేడీ’ కిల్లర్ - అమ్మాయిలను చంపేసి, శవాలతో కేకులు చేసుకుని తినేసింది, కారణం పెద్దదే!


దాచుకున్న సొమ్ములన్నీ.. వ్యసాయానికే..: వారు ఆ పొలాలు కొనేందుకు సుమారు రూ.2 కోట్లు అవసరమయ్యాయి. దీంతో వారు బ్యాంక్‌లో సేవ్ చేసుకున్న రూ.కోటి నగదును ఇందుకు ఖర్చుపెట్టారు. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా వచ్చిన మరో రూ.కోటిని కలిపి ఆ పొలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారు వేరే ఏ ఉద్యోగం చేయడం లేదు. ‘వెజ్ బాక్స్’ బిజినెస్‌నే తమకు ఉపాధిగా మలుచుకున్నారు. ఈ సంస్థ ద్వారా చుట్టుపక్కల ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించి ఆకలి తీర్చడమే కాదు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా చేయాలనేది ఈ స్నేహితుల లక్ష్యం. మరి, వారి లక్ష్యం నెరవేరాలని కోరుకుందామా!