మీరు మాంసాహారులా? అయితే, ఎన్నో రకాల నాన్-వెజ్ ఫుడ్‌ తిని తిని మీకు బోరు కొట్టి ఉంటుంది. కొత్తగా పులి, సింహం, జిరాఫీ మాంసాలను ట్రై చేయండి. అదేంటీ, వన్య ప్రాణాలను తినడం నేరం కదా? అలా ప్రోత్సహిస్తున్నారేంటీ అని అనుకుంటున్నారా? డోన్ట్ వర్రీ, మీరు చట్టబద్దంగానే వాటిని తినొచ్చు. అదెలా సాధ్యం అనేగా మీ సందేహం.. అయితే, పదండి వేటకు!


‘ప్రైమ్‌వల్ ఫుడ్స్’ అనే ఫుడ్ టెక్నాలజీ కంపెనీ త్వరలో లయన్ బర్గర్‌లు, టైగర్ నగ్గెట్స్, జిరాఫీ హామ్‌‌లను మీ కోసం అందుబాటులోకి తేనుంది. ఎలాంటి భయం లేకుండా మీరు వాటిని లొట్టలేసుకుని మరీ తినేయొచ్చు. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. మీకు ఆయా వన్య ప్రాణుల మాంసాన్ని వడ్డించేందుకు వారు.. అడవులకు వెళ్లరు, జంతువులను చంపరు. కానీ, మీరు తప్పకుండా వాటి రుచిని ఆస్వాదించగలరు. 


ప్రస్తుతం వెగాన్ ఉద్యమం జోరుగా సాగుతోంది. మాంసానికి ప్రత్యామ్నాయాలు కూడా చాలామంది వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ టెక్ కంపెనీలు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకు ప్రయోగశాలలోనే మాంసాన్ని తయారు చేస్తున్నారు. కానీ, ప్రత్యేకంగా పులి, సింహం, జీరాఫీ మాంసాలే ఎలా అనే సందేహం మీకు కలిగి ఉండవచ్చు. పైగా, ఇప్పటివరకు అలాంటి మాంసాన్ని విక్రయిస్తారనే సంగతి కూడా మీకు తెలిసి ఉండదు.


 ఈ మాంసాలను లాబొరేటరీలో పెంచే ప్రక్రియలో ఏ జంతువును గాయపరచరు. ఎందుకంటే ఆ మాంసాన్ని వారు ఆయా జంతువుల సాంప్రదాయక కణాల నుంచి స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని ల్యాబ్‌లో పెంచుతారు. రుచిలో కూడా మార్పు ఉండదు. కానీ సింహం లేదా పులిని తినాలనే సాధారణ ఆలోచన చాలా వింతగా ఉంటుంది. అయితే, కొత్తగా రుచిని ఆస్వాదించాలని కోరుకొనేవారిని ఇది ఆకట్టుకుంటుంది. ‘ప్రైమ్‌వాల్ ఫుడ్స్’ దీన్ని మంచి అవకాశంగా భావిస్తోంది. 


Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?


ఏస్ వెంచర్స్ (ప్రైవల్ ఫుడ్స్ ప్రధాన సంస్థ) మేనేజింగ్ పార్టనర్ యిల్మాజ్ బోరా మాట్లాడుతూ.. ‘‘పంటలు పండించినట్లే రుచికరమైన, పోషకాలు కలిగిన మాంసాన్ని మేం తయారు చేస్తాం. ఈ విధానం ద్వారా మేం భవిష్యత్తులో ఇంకా జాగ్వార్ మాంసం, ఏనుగు మాంసాన్ని తయారు చేసే రోజు వస్తుంది. ఇవన్నీ స్వయంగా ల్యాబ్‌లోనే తయారు చేస్తాం కాబట్టి.. ఇవి జంతువులను చంపితే వచ్చే మాంసం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికీ దీన్ని రుచి చూడాలని అనిపిస్తుంది. కాబట్టి, పులి, సింహం, జిరాఫీ తదితర జంతువుల కణజాలంతో మాంసాన్ని తయారు చేసి విక్రయించాలనే ఆలోచన కలిగింది. త్వరలోనే లండన్‌లో ఈ మాంసాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటికి కావల్సిన కణజాలాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం’’ అని తెలిపారు. వినడానికి చిత్రంగానే ఉన్నా.. అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి. 


Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!