వింటర్ వచ్చిందంటే కొంతమందికి వణుకుపుడుతుంది. అందుకు కారణం జలుబు, దగ్గు ఎటాక్ చేసేస్తాయి. ఇక ఆస్తమా, న్యుమోనియా ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. చల్లటి వాతావరణం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముక్కులు బిగుసుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది జలుబు, ఫ్లూ కాలం అనే అంటారు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉన్న మాత్రం పోషకాహారం, వ్యాయామం, కంటి నిండా నిద్ర. సూక్ష్మక్రిములతో పోరాడటానికి శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఈ సూపర్ ఫుడ్స్ మీకు సహాయం చేస్తాయి.


వెల్లుల్లి: ఇందులో సహాజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అల్లిసిన్ అనే సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది.


పసుపు పాలు: ఎంతటి జలుబు, దగ్గు అయినా చిటికెలో నయం చేసే గుణం గోల్డెన్ మిల్క్ కు ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు నుంచి తక్షణ ఉపశమనం కోసం పసుపు పాలలో నల్ల మిరియాల పొడి కూడా చేర్చుకుంటే మంచిది.


తులసి: అంటు వ్యాధులని అరికట్టడంలో సహజ నివారిణిగా పని చేస్తుంది. తులసి ఆకుల రసం తాగినా, ఆకులు తిన్నా కూడా మంచి ఫలితం పొందుతారు.


బాదంపప్పు: విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు తగ్గించే జింక్ ఖనిజాన్ని అందిస్తుంది.


ఉసిరి: సీజనల్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మాక్రోఫేజెస్, కణాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది.


నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి, బయోఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి కీలకంగా వ్యవహరిస్తుంది.


చిలగడదుంప: స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఓ వైపు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ ఆహార పదార్థాలు తీసుకునే జీవక్రియ బాగుండటంతో పాటు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.


ఉల్లిపాయ: చలిని నిరోధించి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆనియన్ సూప్ లేదా వంటల్లో జోడించుకోవడం మంచిది. సలాడ్ లో కూడా ఉల్లిపాయ వేసుకుని తింటే బాగుంటుంది. ఇవి చెమటని పెంచుతాయి.


నెయ్యి: నెయ్యి తింటే జలుబు చేస్తుందని అంటారు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని కొవ్వులు శీతాకాలంలో జీర్ణక్రియకు సహాయపడతాయి. విషాన్ని తొలగించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.


బెల్లం: రక్తనాళాలు శుభ్రపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తగినంత శక్తిని అందిస్తుంది. అందుకో రోజు ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసేసుకోండి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కెఫీన్ లేని అద్భుతమైన టీలు, ఇవి తాగారంటే అందం, ఆరోగ్యం