ఉదయం లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీ తాగకుండా ఉండలేరు. అవి తాగితేనే రిలాక్స్ గా అనిపిస్తుంది కొందరికి. ఒక వేళ టైమ్ కి టీ తాగలేదా ఇంక అంతే తలనొప్పి, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. దానికి వ్యసనపరులుగా మారిపోతారు. కాఫీలోనే కాదు టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె దడ, అధిక రక్తపోటు, డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. అంతే కాదు వికారం, మైకం వంటి కొన్ని ఇతర లక్షణాలు కూడా శరీరంలో కెఫీన్ ఉండటం వల్ల సంభవిస్తాయి. అందుకే సాధారణమైన కెఫీన్ ఉన్న టీ తాగే బదులు ఈ ప్రత్యేకమైనవి తాగారంటే టీ తాగలన్నా మీ కోరిక తీరుతుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.
లెమన్ గ్రాస్ టీ
లెమన్ గ్రాస్ అని పిలిచే ఒక మొక్కతో ఈ టీ తయారు చేస్తారు. దీన్ని ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. దీనితో తయారు చేసుకున్న టీలో కొద్దిగా నిమ్మరసం జోడించుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ సువాసన, రుచి వల్ల ఈ టీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇది తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది.
చమోమిలే టీ
చామంతి పూలతో చేసే టీని నిద్ర పోయే ముందు తీసుకుంటారు. ఎందుకంటే ఇది మంచి నిద్రని ఇస్తుంది. ఈ హెర్బల్ టీని వేడి నీటిలో చామంతి పూలు వేసి తయారు చేస్తారు. ఇది ఆందోళన తగ్గిస్తుంది.
అల్లం టీ
ఘాటైన వాసన, రుచి కలిగిన అల్లం టీ ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులని తగ్గించడంలో అల్లం టీ ప్రయోజనకారిగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. శ్వాసకోశ సమస్యల్ని నయం చేస్తుంది. అల్లం టీ రుచి మరింత పెంచుకునేందుకు ఇందులో కొద్దిగా నిమ్మకాయ తేనె జోడించుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.
రోజ్షిప్ టీ
ఎండిన గులాబీ రేకులతో ఈ టీని తయారు చేస్తారు. ఎర్రటి గులాబీ రంగుని ఇవ్వడమే కాకుండా పూలతో కూడిన రుచిని అందిస్తాయి. ఈ కెఫీన్ లేని టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నపుడు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
పిప్పరమెంట్ టీ
పుదీనా ఆకులతో చేసుకునే ఈ టీ నోటిని తాజాగా ఉంచుతుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడంలో శరీరానికి సహాయపడుతుంది. పొటాషియం, కాల్షియం, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. పొట్టకి మేలు చేస్తుంది.
ఫ్రూట్ టీ
ఫ్రూట్ టీ సాధారణంగా కోరిందకాయ, స్ట్రాబెర్రీ, కాన్ బెర్రీ, నారింజ మొదలైన వాటిని ఉపయోగించి తయారుచేస్తారు. పండ్ల రుచి, తీపి వాసనతో కలిగి ఉంటుంది. ఈ టీలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. మనసుకి ప్రశాంతనిస్తుంది. శరీరాన్ని డిటాక్సీఫై చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.