అధిక తేమ, చల్లని వాతావరణం కారణంగా వర్షాకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య మొటిమలు. ఇవి మొహం మీద ఆయిల్ ని కలిగించి చర్మానికి ఆక్సిజన్ అందకుండా రంధ్రాలకు అడ్డుపడుతుంది. మొహం మీద మొటిమలు చూసేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. వర్షాకాలంలో మొటిమలు రాకుండా ఉండాలంటే మీరు కూడా ఈ టిప్స్ పాటించి చూడండి.


రెగ్యులర్ ఫేస్ వాష్: చర్మ రకానికి సరిపోయే సున్నితమైన క్లెన్సర్ తో ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల మొహం మీద పేరుకుపోయిన మలినాలు, జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు ఏర్పడకుండా నివారిస్తుంది. చర్మం మీద ఏర్పడే అదనపు నూనెని ఇది తొలగించడంలో సహాయపడుతుంది.


ముఖాన్ని తాకవద్దు: ముఖాన్ని తరచుగా తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. చేతుల నుంచి బ్యాక్టీరియా చర్మం మీదకు చేరుతుంది. ఇది బ్రేక్ అవుట్ కి దారి తీస్తుంది.


టోనర్ ఉపయోగించాలి: చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా టోనర్ ని చేర్చుకోవాలి. ఇది చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చర్మ రంధ్రాల రూపాన్ని తగ్గిస్తుంది. మొటిమలు ఏర్పడకుండా సహాయపడుతుంది.


మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉన్నప్పటికీ చర్మాన్ని తేమగా ఉంచడం చాలా అవసరం. తేలికైన, నాన్ కామెడోజెనిక్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇది రంధ్రాలు మూసుకోకుండా అడ్డుకుంటుంది. ఆయిల్ లేని లేదా నీటి ఆధారిత ఉత్పత్తులు ఎంచుకుంటే మంచిది.


సన్ స్క్రీన్: వర్షాకాలంలో సన్ స్క్రీన్ రాసుకుంటే మొహం మరింత జిడ్డుగా మారుతుందేమో అనుకుని కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ మాన్ సూన్ సీజన్ లో కూడా సన్ స్క్రీన్ స్కిప్ చేయకూడదు. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం కనీసం spf 30 ఉన్న జిడ్డు లేని సం స్క్రీన్ ఎంచుకోవాలి.


జుటు శుభ్రంగా ఉంచాలి: చర్మం మాత్రమే కాదు జుట్టు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. జిడ్డు గల జుట్టు మొటిమలకు దోహదపడుతుంది. ఆ ఆయిల్ ఫేస్ మీదకి వస్తుంది. దీని వల్ల కూడా మొటిమలు వస్తాయి. అందుకే జుట్టు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. నుదురు మీద జుట్టు పడకుండా వెంట్రుకలు వెనక్కి కట్టుకోవాలి.


హెవీ మేకప్ వద్దు: వర్షాకాలంలో మేకప్ తేలికగా, తక్కువగా ఉంచుకోవడం ఉత్తమం. ఎక్కువ మేకప్ వేసుకోవడం వల్ల నూనె ఉత్పత్తులు రంధ్రాలని మూసుకుపోయే విధంగా చేస్తాయి. ఆయిల్ లేని, నీటి ఆధారిత సౌందర్య సాధనాలు ఎంచుకోవాలి. పడుకునే ముందు మర్చిపోకుండా తప్పనిసరిగా మేకప్ తొలగించుకోవాలి. లేదంటే చర్మం పాడైపోతుంది.


ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జిడ్డు ఎక్కువగా ఉండే ఆహారాల వినియోగాన్ని నివారించాలి. ఇవి మొటిమలు ఏర్పడటానికి దోహదం చేస్తాయి.


హైడ్రేట్ గా ఉండాలి: చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. వర్షాకాలంలో నీరు తక్కువగా తీసుకుంటారు. కానీ అలా కాకుండా తగినంత నీరు తీసుకుంటే శరీరం నుంచి ట్యాక్సిన్స్ బయటకి పోతాయి. హైడ్రేట్ చర్మం అదనపు నూనె ఉత్పత్తి చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.


మొటిమలు గిల్లకూడదు: కొందరు అత్యుత్సాహంతో మొటిమలు గిల్లుతారు. అలా అసలు చేయకూడదు. అవి తగ్గకపోగా మచ్చలు ఏర్పడతాయి. పక్కన కూడా మొటిమలు ఏర్పడే ప్రమాదం ఉంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఇవన్నీ చిన్న సమస్యలే అనుకుంటాం - కానీ, అవి ప్రాణాంతక క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?