పండగలు వచ్చాయంటే ఇళ్ళల్లో సందడి వాతావరణమే. బంధువులు, స్నేహితుల రాకతో ఇల్లంతా కళకళాడిపోతుంది. రకరకాల వంటలతో విందు భోజనం చేస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్ గా లాగించేస్తారు. కంటి ముందర అన్ని ఘుమఘుమలాడే వంటలు కనిపిస్తే నోరు అసలు కంట్రోల్ లో ఉండదు. పొట్ట నిండినా కూడా కొంతమంది అతిగా తినేస్తారు. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. పొట్టలో ఇబ్బంది, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, పొత్తి కడుపులో నొప్పి వంటి అనేక సమస్యలు మీద పడిపోతాయి. ఇక తిన్నది అరిగించుకోవడానికి తిప్పలు పడాలి.


ఇటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి కొన్ని మార్గాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు కడుపు అసౌకర్యంగా అనిపించడం సహజం. అయితే సరిగ్గా నమలడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీర్ణ క్రియ సులభతరం అవుతుంది. కూరగాయలు వంటి అధిక ఫైబర్ ఆహారాలు తీసుకున్నప్పుడు ఇలా చేయడం చాలా ముఖ్యం. కానీ మీరు తీసుకునే ఆహారాలు అనారోగ్యకరమైనవి అయితే మాత్రం కడుపు నొప్పి లేదా జీర్ణక్రియ బాధను కలిగిస్తుంది. దాని నుంచి బయట పడే మార్గాలు ఇవి.


కాసేపు వాకింగ్: అతిగా భోజనం చేసిన తర్వాత కాసేపు నడవటం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం శరీరం విశ్రాంతిగా ఉండటం వల్ల పేగుల్లో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. దాని నుంచి ఉపశమనం పొందటానికి నడక ఉత్తమ ఎంపిక. ఉత్సాహంగా వాకింగ్ చేయడం వల్ల శరీరంలో కదలికలు కారణంగా పొట్ట ప్రశాంతంగా ఉంటుంది. 2006 అధ్యయనం ప్రకారం.. నడక వల్ల ఆహారం చిన్న పేగుల్లోకి చేరడం ఆలస్యమవుతుందని, దాని వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ను సులభతరం చేస్తుందని తేలింది.


నీరు తాగాలి: చల్లగా లేదా వేడి నీళ్ళు కాకుండా సాధారణ గది ఉష్ణోగ్రత కలిగిన నీళ్ళు తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. వేడి నీళ్ళు తాగితే కడుపుని మరింత ఇబ్బంది పెడుతుంది కాబట్టి అలా చేయకపోవడమే మంచిది.


మసాజ్ చెయ్యండి: పొట్టపై ఎడమ నుంచి కుడి వైపుకి మెల్లగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది జీర్ణక్రియకి మరింత సహాయపడుతుంది. ఉబ్బరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. చేతి వేళ్ళతో పొత్తి కడుపు నుంచి పక్కటెముకల వైపు పైకి చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు.


వేడి నీటి బ్యాగ్ ఉపయోగించుకోవచ్చు: వేడి నీటి బ్యాగ్ కాసేపు పొట్టపై ఉంచుకోవచ్చు. వేడి తగలడం వల్ల కండరాలు విశ్రాంతి మోడ్ లోకి వెళతాయి. దీని వల్ల పేగుల్లోని గ్యాస్ బయటకి వెళ్లేందుకు తేలికగా ఉంటుంది.


పిప్పరమెంట్ టీ: గ్యాస్ట్రిక్ సమస్యను ఎదుర్కోవడంలో పిప్పరమెంట్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తీసుకోవడం వల్ల రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. అలాగే పిప్పరమెంట్ నూనె కూడా పొట్ట మీద రాసుకోవడం వల్ల కడుపు తిమ్మిరిని తగ్గించుకోవచ్చు. పేగు సిండ్రోమ్ లక్షణాలు తగ్గించుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: హెయిర్ బొటాక్స్ అంటే ఏంటి? ఎలాంటి జుట్టుకు ఈ ట్రీట్మెంట్ ఇస్తారు