తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరొక నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. కైకాల సత్యనారాయణ, చలపతి రావు మృతి చెందిన బాధ నుంచి బయట పడక ముందు మరో నటుడు వల్లభనేని జనార్ధన్ ఆకస్మిక మరణం ప్రముఖులను బాధించింది.
వల్లభనేని జనార్ధన్...
విజయ్ బాపినీడు అల్లుడు!
వల్లభనేని జనార్ధన్ (Vallabhaneni Janardhan) గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. వల్లభనేని జనార్ధన్ స్వస్థలం ఏలూరు సమీపంలోని పోతులూరు. విజయవాడ లయోలా కాలేజీలో చదివారు. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చారు. నటుడిగా, దర్శక నిర్మాతగా పలు చిత్రాలు చేశారు.
ప్రముఖ దర్శక నిర్మాత విజయ్ బాపినీడుకు ఆయన అల్లుడు. బాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరితో జనార్ధన్ వివాహం జరిగింది. జనార్ధన్, లళిని దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురిలో ఓ అమ్మాయి చిన్నతనంలో మరణించారు. మరో అమ్మాయి అభినయ ఫ్యాషన్ డిజైనర్. అబ్బాయి అవినాశ్ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు.
'గ్యాంగ్ లీడర్'తో గుర్తింపు!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'గ్యాంగ్ లీడర్'లో సుమలత తండ్రిగా వల్లభనేని జనార్ధన్ నటించారు. ఆ సినిమాతో ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. నటుడిగా వందకు పైగా సినిమాలు చేసిన జనార్ధన్... దర్శకుడు, నిర్మాత కూడా!
దర్శక నిర్మాతగా వల్లభనేని జనార్ధన్ (vallabhaneni janardhan death) తొలి సినిమా 'మామ్మగారి మనవరాలు' మధ్యలో ఆగింది. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా 'అమాయక చక్రవర్తి' సినిమాకు దర్శకత్వం వహించారు. అది కన్నడ హిట్ 'మానస సరోవర్'కు రీమేక్. శోభన్ బాబు హీరోగా 'తోడు నీడ' సినిమా చేశారు. అది హిందీ సినిమా 'బసేరా'కు రీమేక్. ఇంకా పలు సినిమాలు చేశారు.
Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?
వల్లభనేని జనార్ధన్ నటుడు కావాలని అనుకోలేదు. 'శ్రీమతి కావాలి' సినిమా చేస్తున్న సమయంలో ఆర్టిస్ట్ రాకపోవడంతో ఆయన మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత మామగారు విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన 'గ్యాంగ్ లీడర్'తో గుర్తింపు రావడంతో నటుడిగా కంటిన్యూ అయ్యారు.
నలుగురు స్టార్ హీరోలతో...
చిరంజీవి 'గ్యాంగ్ లీడర్', నందమూరి బాలకృష్ణ 'లక్ష్మీ నరసింహ', వెంకటేష్ 'సూర్య ఐపీఎస్', నాగార్జున 'వారసుడు'... నలుగురు స్టార్ హీరోలతో జనార్ధన్ నటించారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీ కోసం' చిత్రానికి నిర్మాణ సారధ్యం వహించారు. 'అన్వేషిత' సహా కొన్ని సీరియల్స్ కూడా చేశారు. జనార్ధన్ మరణం పట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో కైకాల సత్యరాయణ, చలపతి రావు సహా ఇటీవల మరణించిన నటీనటులకు నివాళి సభ ఏర్పాటు చేశారు.
Also Read : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?