ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. పచ్చని ఆకు కూరలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు దారి చేరకుండా రక్షణగా నిలుస్తాయి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ అధికంగా లభిస్తాయి. ఇవి రోజువారీ అవసరాన్ని తిరుస్తాయి. శరీరంలో మినరల్స్ లోపాన్ని వీటి తీసుకోవడం వల్ల అధిగమించవచ్చు. అంతే కాదు, ఇవి బరువు తగ్గించడంలోను సహాయపడతాయి.
సాధారణంగా బరువు తగ్గడానికి ఏవేవో తినాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ వాటికి బదులుగా సింపుల్ గా రోజు మీ ఆహారంలో ఆకుకూరలు ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. అనుకున్న గడువులోగా త్వరగా బరువు అదుపులో ఉండేందుకు ఈ ఆకుకూరలు సహకరిస్తాయి. వాటిలో కొన్ని..
బచ్చలికూర
ఇందులోని ఫైబర్ గుణాలు ఆకలి తగ్గించి పొట్ట నిండిన భావాన్ని కలిగిస్తాయి. పైగా కేలరీలు శరీరంలో శోషించబడవు. పొట్టలోని కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదనపు కొవ్వుని వదిలించుకోవడానికి అల్పాహారం లేదా భోజనంలో బచ్చలికూర ఉండే విధంగా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
బ్రకోలి
తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం బ్రకోలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది. మధుమేహులకి ఇది మేలే చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచేందుకు బ్రకోలి సహాయపడుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ నీతి శాతం ఎక్కువగా ఉంటుంది.
కాలే
కాలే తక్కువగా తింటారు కానీ ఇది బరువుని నియంత్రించేందుకు దోహదపడుతుంది. కాలేలో కేలరీలు తక్కువ, నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ శక్తి ఉంటుంది. తక్కువ సాంద్రత కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పాలకూర
పాలకూర ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అంటారు. కానీ అది అపోహ మాత్రమే అని కొట్టి పడేస్తారు నిపుణులు. నిజానికి పాలకూరలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా అనిపిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. కొవ్వు తక్కువ ఉండే పదార్థం. బరువు తగ్గాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు తమ డైట్లో పాలకూర చేర్చుకుంటే చక్కని ఫలితాలు పొందవచ్చు.
మునగ ఆకులు
మునక్కాయలతో అనేక రకాల వంటకాలు చేసుకుంటారు. కానీ మునగ చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకుల్లో క్లోరోజెనిక్ యాసిడ్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. చాలా మంది మునగ ఆకుతో పప్పు వండుకుని తింటారు. ఇది కొవ్వుని కరిగించి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించేందుకు సహాయపడుతుంది. మునగాకులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఇన్ఫ్లమేనటరీ గుణాలు మెండుగా ఉన్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: మహిళలు ఈస్ట్రోజెన్ లోపం ఉందా? జాగ్రత్త గుండె పోటు వచ్చే ప్రమాదం కావొచ్చు