వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు. ఆరోగ్యం కోసమో లేదా బరువు తగ్గడం కోసమో కొందరు వీరావేశంతో పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుంటారు. రోజుకు కనీసం 10 వేల అడుగులైనా నడిచేద్దాం అనుకుంటారు. కానీ, తర్వాతి రోజు ఆ టార్గెట్ పూర్తి చేయలేక.. ఏకంగా వాకింగ్ చేయడమే మానేస్తారు. అయితే, మీరు అన్ని అడుగులు టార్గెట్ పెట్టుకోవక్కర్లేదని, అంతకంటే తక్కువ స్టెప్స్ వేసినా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది 10,000 అడుగులు నడవడం చాలా ఆరోగ్యవంతమైన లక్ష్యంగా భావిస్తున్నారు. కానీ అంతకంటే తక్కువ అడుగులు నడిచినా సరే ఆరోగ్యానికి మేలే జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 4000 అడుగుల నడక వల్ల అకాల మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
పోలాండ్ లోని మెడికల్ యూనివర్సిటి ఆఫ్ లాడ్జ్ శాస్త్రవేత్తలు దాదాపు 2,27,000 మంది నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు. నడిచేందుకు ఎలాంటి అవధులు లేవని అంటున్నారు. ఎంత ఎక్కువ నడిస్తే అంత లాభమని తెలుపుతున్నారు. 2,337 అడుగులు నడిచిన వారిలో గుండెజబ్బుల ప్రమాదాలు తగ్గడం ప్రారంభం అవుతుంది. దీనికి కేవలం 25 నిమిషాల సమయం పడుతుంది. 3,967 అడుగులు లేదా 40 నిమిషాల నడకతో యువకుల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడం సాధ్యపడుతుందని చెబుతున్నారు. ప్రతి 1000 అడుగులకు అదనంగా 15 శాతం గుండెజబ్బుల రిస్క్ తగ్గుతుందట.
60 సంవత్సరాలు పైబడిన వారు రోజుకు 6000 నుంచి 10000 అడుగుల మధ్య నడిస్తే వారికి గుండె జబ్బు వచ్చే ప్రమాదం 42 శాతం వరకు తగ్గుతుందని ఒక అంచనా. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదని ఈ అధ్యయనం నిర్ధారిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరికీ ఇది వర్తిస్తుందని తాము కనుగొన్నట్టు ఈ అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు.
కేవలం 4000 అడుగులు నడిస్తే చాలు.. ఎలాంటి అనారోగ్య కారణంతో అయినా కలిగే ఆకస్మిక మరణం నుంచి తప్పించుకోవచ్చట. ఇక కార్డియో వాస్క్యూలార్ జబ్బుల నుంచైతే ఇంకా తక్కువ నడిచినా సరే గణనీయమైన రక్షణ లభిస్తుందనేది నిపుణుల అభిప్రాయం.
బద్దకం... ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద కిల్లర్ అని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంగా చెప్పింది. తగినంత వ్యాయామం లేకపోవడం అనేది టైప్ 2 డయాబెటిస్ కు ప్రధాన కారణం. ఇక గుండె జబ్బులు, డిమెన్షియా వంటి సమస్యలు కూడా నడకతో నివారించవచ్చు.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫ్రివెంటివ్ కార్డియాలజీలో ఇప్పటి వరకు జరిగిన 17 రకాల అధ్యయనాల గురించిన విశ్లేషణ ఒకటి ప్రచురించారు. రోజుకు 20, 000 అడుగులు నడిచే వారు మరణాన్ని వాయిదావేస్తూనే ఉన్నారు అని వ్యాఖ్యానించారు.
మంచి ఆరోగ్యానికి చాలా ఎక్కువ అడుగులు నడిచే పనిలేదు, కాస్త నడిచినా చాలు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కదలకుండా కూర్చుని ఉండే జీవన శైలి మాత్రం ఎంత మాత్రమూ మంచిది కాదు.
Also read : మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial