మానవ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. ఇది అనేక ముఖ్యమైన శారీరక కార్యకలాపాలలో పాల్గొంటుంది. మెగ్నీషియం శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ కార్యకలాపాలలో సహాయపడుతుంది. అందుకే దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. తగిన మొత్తంలో లేకపోతే శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అనేక సమస్యలు కలిగిస్తుంది. డీఎన్ఏ తయారీలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి మెగ్నీషియం లోపించడం వల్ల వచ్చే అనార్థాలు..


కండరాల తిమ్మిరి


చాలా సాధారణంగా ఎదురయ్యే బాధ కండరాల తిమ్మిరి. వైద్యుల దగ్గరకి వెళ్ళకుండా మామూలు నొప్పే అనుకుని ఇంటి నివారణలకు మొగ్గుచూపుతారు తిమ్మిరి, మెలికలు, వణుకు వంటివి మెగ్నీషియం లోపం లక్షణాలు. అయితే దీనికి ఇదే కారణం కూడా కాకపోవచ్చు. వేరే కారణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో తగినంత మెగ్నీషియం లేకపోవడం వల్ల మూర్చలు రావచ్చు.


డిప్రెషన్, ఆందోళన


మెగ్నీషియం లోపం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దీని తక్కువ స్థాయిలు డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. మెగ్నీషియం న్యూరోలాజికల్ పాత్ వేస్ తో ముడి పడి ఉంటుంది. ఇది సరిగా పని చేయనప్పుడు నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ నివేదిక వెల్లడిస్తోంది.


హార్ట్ బీట్ లో మార్పులు


మెగ్నీషియం గుండె సరిగా కొట్టుకునేలా చేస్తుంది. గుండె కండరాల సంకోచాలు ఉండేలా చేసే ఖనిజాలలో ఇదీ ఒకటి. ఈ మినరల్ తక్కువగా ఉండటం వల్ల అరిథ్మియా అనే సమస్యని తీసుకొస్తుంది. అంటే హృదయ స్పందన రేటులో మార్పులు చోటుచేసుకుంటాయి. దీని లోపం కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది.


ఎముకలు బలహీనం


కాల్షియం మాత్రమే కాదు మెగ్నీషియం కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఖనిజం. శరీరంలో 50 శాతం కంటే ఎక్కువ మెగ్నీషియం ఎముకలలో నిల్వ చేయబడుతుంది. తగినంత మేగ్నిషయం లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోయి బలహీనంగా మారిపోతాయి.


అలసట


కండరాల పనీతీరులో కీలక పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడం వల్ల కండరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బలహీనంగా మారడం వల్ల త్వరగా అలసటగా అనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటారు. అందుకే వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం మంచిది.


ఎంత మెగ్నీషియం అవసరం?


రోజుకి 400ఎంజీ మేగ్నిషయం తీసుకోవాలి. అదే మహిళలకు అయితే 300 ఎంజీ అవసరం అవుతుంది. గుమ్మడికాయ గింజలు, బచ్చలి కూర, బీన్స్, బ్రౌన్ రైస్, వేరు శెనగ వెన్న(పీనట్ బటర్), బాదం పప్పు, వేరుశెనగ పలుకులు, జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇవే కాదు మాంసకృతులు, డార్క్ చాక్లెట్, పాలలో కూడా శరీరానికి కావలసినంత మెగ్నీషియం అందుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు