వేసవిలో లభించే పండ్లు అనగానే అందరూ నోరూరించే మామిడి పండు గురించి మాత్రమే చెప్తారు. కానీ ఇదే కాదు సమ్మర్ లో లభించే తప్పకుండా తినాల్సిన పండు మరొకటి ఉంది. అదే నేరేడు పండ్లు. కాస్త వగరుగా, కొంచెం పుల్లగా, తీపి రుచి కలిగి ఉండే నేరేడు పండ్లు తినడానికి కొంతమంది ఇష్టం చూపించరు. ఎందుకంటే అవి తిన్న తర్వాత నాలుక కాసేపు మొద్దుగా, ఏదో పదార్థం మొత్తం చుట్టేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ వేసవి ఫ్రూట్ జామున్ వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహులకు అద్భుతమైన పండు ఇది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనిలో పుష్కలంగా ఉంది. పండు మాత్రమే కాదు జామున్ విత్తనాలు ప్రయోజనాలను అందిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. పై తొక్క తినేసి అందులోని విత్తనాలు ఊసేస్తారు. కానీ పండు మాత్రమే కాదు అందులోని విత్తనాలతో చేసిన పౌడర్ కూడా ఆరోగ్యానికి మేలైన ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


⦿ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి, గ్లైకోసూరియాను తగ్గించేటప్పుడు జామున్ విత్తనాలు చాలా ప్రయోజనంగా ఉంటాయి.  పండు విత్తనాలు జాంబోలిన్, జాంబోసిన్ అని పిలువబడే క్రియాశీల పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును మందగించేలా చేసి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపికగా మారుతుంది.


⦿ ఈ పౌడర్ ఒక డిటాక్సిఫైయింగ్ హెర్బ్ గా పని చేస్తుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేలా చేస్తుంది. చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేందుకు సహాయపడుతుంది.


⦿- యాంటీ ఆక్సిడెంట్ కారణంగా కాలేయానికి మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. కాలేయ కణాలను కాపాడుతుంది. ఇదే కాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.


⦿ జామున్ విత్తనాల పౌడర్ లో ఎల్లాజిక్  ఆమ్లం అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తపోటు హెచ్చుతగ్గులను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.


⦿ నేరేడు పండు విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.


⦿ నేరేడు గింజలను పౌడర్ చేసి దాన్ని పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు తగ్గుతాయి.


⦿ చిన్న పిల్లలు రాత్రులు బెడ్ తడిపేస్తుంటే అర టేబుల్ స్పూన్ నేరేడు గింజల పౌడర్ ని నీళ్ళలో మిక్స్ చేసి రోజుకి రెండు సార్లు ఇవ్వాలి. ఇలా చేస్తే రెండు మూడు వారాల్లో ఆ అలవాటును పిల్లలు మానుకుంటారు.


⦿ ఈ విత్తనాలకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని ఎండలో ఆరబెట్టి పొడిగా చేసుకుని తీసుకుంటే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?