గంట క్రితం చేసిన పని కాసేపటికి గుర్తు ఉండదు. ఒకసారి చేసిన పనే పదే పదే చేస్తుంటారు. రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా మెదడు పనితీరు ఉందంటే మీరు చిత్త వైకల్యం బారిన పడుతున్నట్టే. దీన్నే డిమెన్షియా అంటారు. ఇది ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుని దగ్గరకి వెళ్ళాలి. జ్ఞాపకశక్తి, పనితీరు, వ్యక్తిత్వం, మాట తీరు గురించి పని చేసే భాగాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. మెదడులోని ఫ్రంట్ టెంపోరల్ లోబ్స్ లో ఉన్న న్యూరాన్లకు నష్టం కలిగేలా చేస్తుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ నిపుణులు చెప్పిన దాని ప్రకారం డిమెన్షియా రోగులకు తరచుగా సమస్య గురించి తెలియదు. అభిజ్ఞా క్షీణత, జ్ఞాపకశక్తి, ఆలోచన విధానం దెబ్బతింటుంది.


చిత్త వైకల్యం లక్షణాలు


జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది, సాధారణంగా రోజువారీ చేసుకునే పనులు మరచిపోవడం, ఉన్నట్టుండి హింసాత్మకంగా ప్రవర్తించడం వంటివి చిత్త వైకల్యం లక్షణాలు. ఇవన్నీ సాధారణ జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. రోగి జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది చాలా ప్రమాదకరం. డిమెన్షియా ఉన్న రోగులను బయటకి వదిలేస్తే మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరతారనే గ్యారెంటీ ఉండదు. బాధితుడికి మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రాణాంతకం కావచ్చు. సాధారణంగా క్షీణించే పరిస్థితి. రోగి మరణాలకు కూడ ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు.


చిత్త వైకల్యం నిర్ధారణ


అభిజ్ఞా క్షీణతకు సంబంధించిన పరిస్థితి ఉందో లేదో వైద్యులు తప్పనిసరిగా నిర్ధారించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే నయం చేయవచ్చు. కాగ్నిటివ్, న్యూరోలాజికల్ పరీక్షలు, మెదడు స్కాన్, సైకియాట్రిక్ అసెస్ మెంట్, రక్త పరీక్షలతో సహ వివిధ పద్ధతులు ఉపయోగించి రోగ నిర్ధారణ చేస్తారు. చిత్త వైకల్యాన్ని నిర్దారించడానికి 10 నిమిషాల స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవచ్చు. దీన్ని MMSI అంటారు.రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా మతిమరుపు సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.


చిత్త వైకల్యాన్ని ఎదుర్కోవడం ఎలా?


చిత్త వైకల్యం పురోగతి నిరోధించడానికి ముందు దాని ప్రాథమిక కారణం ఏమితో తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఈ వ్యాధి తీవ్రమైన డిప్రెషన్, విటమిన్ బి 12 కొరత వంటి పరిస్థితుల వల్ల కూడా జరుగుతుంది. చురుకైన జీవనశైలి, పోషకాహారం తినడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వంటి వాటి ద్వారా డిమెన్షియాను తగ్గించుకోవచ్చు.


ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారం తీసుకుంటే మెదడులో మార్పులు జరుగుతాయి. మతిమరుపు నుంచి బయట పడొచ్చు. కొవ్వు చేపలు, వాల్ నట్స్ తీసుకున్న తర్వాత జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాల్మన్ చేపలు, ఆలివ్ ఆయిల్, ఇతర కొవ్వు చేపలు పుష్కలంగా తినడం వల్ల డిమెన్షియా ప్రమాదాన్ని నివారించవచ్చు. కనోలా నూనె, చియా గింజలు, వేరు శెనగ, అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. వారానికి కనీసం రెండు సార్లు వీటిని తింటే మంచిది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు