మనకి ఇక్కడ వానలు కుమ్మేస్తున్నాయి. ఇక్కడేనా దాదాపు పది రాష్ట్రాల్లో వర్షాలు వాయించేశాయి. కానీ అదేంటో ఉత్తరప్రదేశ్ లోన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వానలే లేవు. గోండ్ జిల్లాలోని ఝాలా గ్రామంలో కూడా వర్షాలు సరిగా పడలేదు. ఈ ఏడాదైతే మరీ అధ్వానం. వానలే లేక అక్కడ పంటలన్నీ ఎండిపోయాయి. ఆ గ్రామానికి చెందిన వ్యక్తే సుమిత్ కుమార్ యాదవ్. ఆయన వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్న వ్యక్తి. దేశమంతా వర్షాలు పడుతున్నా తాము మాత్రం ఎండలతో ఎండిపోతున్నమంటూ ఎంతో బాధపడ్డాడు.చివరకి కోపంతో ఓ పని చేశాడు. 


గ్రామాల్లో నెలకోసారి ఫిర్యాదులు స్వీకరించడానికి, సమస్యలు వినడానికి అధికారులు వస్తుంటారు. దీన్నే సంపూర్ణ సమాధాన్ దివస్ అంటారు యూపీలో. సుమిత్ గ్రామంలో కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. అందులో తన ఫిర్యాదును అధికారులకు అందించాడు సుమిత్. అధికారులు కనీసం అతను ఎవరి మీద, ఏం ఫిర్యాదు చేశాడో కూడా చూసుకోకుండా ‘చర్యలు తీసుకోండి’ అంటూ ఆర్డర్ వేశారు. ఆ ఫిర్యాదు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అధికారులు నాలుక కరచుకున్నారు. 


ఇంతకీ ఎవరిమీద?
అన్నిచోట్లా వానలు పడుతున్న తమ గ్రామంలో, చుట్టుపక్కల మాత్రం వాన చుక్క రాలడం లేదు, ఇది పక్షపాతం చూపించడమే అంటూ సుమిత్ ఏకంగా ఇంద్రుడిపైనే ఫిర్యాదు చేశాడు.వాన దేవుడిని తమ గ్రామానికి పంపించడం లేదన్నది అతడి అభిప్రాయం. ఆ ఫిర్యాదును అందుకున్న జిల్లాలోని ఓ సీనియర్ అధికారి ‘ఇంద్రదేవుడిపై చర్యలు తీసుకోండి’ అని సంతకం చేసి ఇచ్చేశాడంట.  ఆ ఫిర్యాదులో సుమిత్ ‘వానల్లేక అందరం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి  ఇంద్రదేవుడిపై చర్యలు తీసుకోండి’ అని లేఖ రాసి ఇచ్చాడు. ఆ ఫిర్యాదు గ్రామం నుంచి జిల్లా ఆఫీసుకు చేరింది. అక్కడ కూడా కనీసం ఎవరి మీద ఫిర్యాదు చేశాడో చూసుకోలేదు అధికారులు. ఇప్పుడు విషయం బయటపడ్డాక మాత్రం తాము ఆ ఫిర్యాదుపై  చర్యలు తీసుకోమని సిఫారసు చేయలేదని చెప్పుకుంటున్నారు జిల్లా అధికారులు. 


Also read: ఈ కోడిగుడ్ల నిండా యాంటీబాడీలే, కొత్తగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇవి తింటే కరోనా నుంచి సేఫ్




Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే


Also read: ‘పొమాటో’ మొక్కకు కాసిన ‘బ్రిమాటో’ కూరగాయ ఇదిగో, వండుకుని తింటే ఆ రుచే వేరు