పేగుల్లో గ్యాస్ నిండిపోవడం, పేగుల్లో ఉండే బ్యాక్టీరియా సమతులంగా ఉండకపోవడం మలబద్ధకం సహా రకరకాల కారణాలతో కడుపు ఉబ్బరంగా మారుతుంది.


ఒక వయసు తర్వాత చాలా మందిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య కడుపులో గ్యాస్ చేరడం. ఎన్నో కారణాలతో కడుపు ఉబ్బరంగా మారవచ్చు. కానీ ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే ఈ సమస్యకు కారణం. ఒక్కోసారి నచ్చిన పదార్థాలు ఉన్నాయని ఎక్కువ తినేస్తుంటాం. ఇలా తినటం వల్ల కడుపుబ్బరం రావచ్చు. కొన్ని సార్లు పెద్దగా తినకపోయిన కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించి కడుపుబ్బరంగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం, చాలా సేపు ఒకే చోట కూర్చోవడం, పొగతాగే అలవాటు, మధ్య పానం వంటి రకరకాల అలవాట్లు కడుపుబ్బరానికి కారణం కావచ్చు కూడా.


కడుపుబ్బరంగా ఉండడం పెద్ద అనారోగ్యం కాకపోవచ్చు. కానీ తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవుతుంది. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు.



  • భోంచేశాక సోంపు నమిలే అలవాటు చాలా మందికి ఉంటుంది. సొంపు పేగు కండరాలను బిగుతుగా మార్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల కడుపుబ్బరం నుంచి ఉపశమనం దొరకుతుంది. సోంపులో యాంటి స్పాస్మోడిక్ సమ్మేళనాలైన అనేథోల్, ఫెన్చోన్, ఎస్ట్రాగోల్ ఉంటాయి. అందువల్ల కడుపుబ్బరం తగ్గిపోతుంది.

  • అల్లం కూడా కడుపుబ్బరం తగ్గిస్తుంది. అల్లంలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఛాతిలో మంటను కూడా తగ్గిస్తాయి. అల్లంలో ఉండే జింజెరోల్స్ విరేచనం సాఫీగా అయ్యేందుకు దొహదం చేస్తాయి. ఫలితంగా గ్యాస్, ఉబ్బరం తగ్గిపోతుంది.

  • పుదినా జీర్ణ సమస్యలకు మంచి మందు. పుదినాలో ఉండే పిప్పరమింట్ లోని చలువ వల్ల గ్యాస్, కడుపుబ్బరంగా ఉండడం వంటి గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి.

  • కడుపుబ్బరానికి వాము మంచి పరిష్కారం. ఇందులో ఉండే పినేన్, లియోనెన్, కార్వోన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఉబ్బరానికి మంచి చికత్సగా పనిచేస్తాయి.

  • జీలకర్ర కూడా కడుపుబ్బర సమస్యను దూరం చేస్తుంది. జీలకర్ర లో ఆల్డీహైడ్, సైమన్ వంటి టెర్పెనోయిడ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని నిరోధిస్తాయి. గ్యాస్, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


కడుపుబ్బరంగా ఉన్నపుడు పై వాటిలో ఏదో ఒకటి నమలడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కడుపుబ్బరం రాకుండా కూడా చూసుకోవచ్చు. ఆహారాన్ని నమిలి తినడం వల్ల కడుపుబ్బర సమస్యను నివారించవచ్చు. త్వరత్వరగా సరిగా నమలకుండా మింగడం వల్ల గాలి కూడా మంగేస్తారు. అందువల్ల కాస్త తిన్నా కడుపుబ్బరం కావచ్చు. సరిగ్గా నమిలి తింటే జీర్ణ క్రియ కూడా మెరుగవుతుంది. పచ్చి సలాడ్ ముక్కలు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపుబ్రబం తగ్గుతుంది. తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తాగొద్దు, కొద్ది విరామం తర్వాత నీళ్లు తాగితే కడుపుబ్బర బాధ పెద్దగా వేధించదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.