ఈ రోజుల్లో కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గానీ ఇల్లు కట్టం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా చేయకూడదు. అయితే, అమెరికాకు చెందిన ఓ కుటుంబం ఇల్లు కట్టుకోడానికి పెద్ద కష్టపడలేదు. పాడుబడిన ఓ స్కూల్ బస్సునే ఇల్లుగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బస్సును ఇల్లుగా మార్చుకున్నారంటే తక్కువ అంచనా వేయకండి. ఇది లగ్జరీ ఫ్లాట్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇందులో కిచెన్‌తోపాటు మూడు బెడ్‌లతో బెడ్ రూమ్ కూడా ఉంది.
కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో జనాల మధ్య జీవించడమంటే దినదిన గండమే. అందుకే ఓ కుటుంబానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అంతా ఇళ్ల నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలు కూడా ఆన్‌లైన్ ద్వారానే క్లాసులకు హాజరవుతున్నారు. అయితే ఓ జంట మాత్రం ‘వర్క్ ఫ్రం బస్’ అంటూ కొత్తగా ఆలోచింది. ఓ పాత స్కూల్ బస్‌ను ఇల్లుగా మార్చుకున్నారు.
ఎలిజబెత్, ఆమె భర్త స్పైక్, వారి ఇద్దరి పిల్లలు ఓ అడ్వేంచర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరు కారు.. వ్యాన్‌లో ట్రిప్‌కు వెళ్లారని అనుకుంటే పొరపాటే. ఓ పాత స్కూల్ బస్సును మూడు పడకాలతో అందమైన ఫ్లాట్‌గా మార్చేసుకున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 15 వేల డాలర్లు (రూ.11,12,283) వెచ్చించి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.
ఎలిజబెత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా 3,500 (రూ.2,59,507) వెచ్చించి ఆ బస్సును కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి మేము రోడ్ ట్రిప్ వెళ్తామని అనుకున్నాం. కానీ, కరోనా వైరస్ వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో కొత్తగా ఏమైనా చేయాలనే ఆలోచనతో ఈ బస్ హౌస్‌ను నిర్మించుకున్నాం. బస్సులో ఇల్లు నిర్మాణం గురించి ముందుగా కొన్ని రీసెర్చ్‌లు చేశాం. ముందుగా మేము ఆ బస్సులోని ఇంటీరియర్లను తొలగించాం. ఆ తర్వాత గ్రీన్, వైట్ కలర్స్‌తో పెయింట్లు వేశాం’’ అని ఎలిజిబెత్ తెలిపింది.
పెయింటింగ్, ఉడ్ వర్క్ పూర్తయిన తర్వాత.. అందులో కింగ్ సైజ్ బెడ్, దానికి ముందు పిల్లల కోసం బంక్ బెడ్ వేశారు. ఇందులో ప్రత్యేకంగా బాత్రూమ్, షవర్ రూమ్, చిన్న కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. వంటకాల తయారీ కోసం ఎలక్ట్రిక్ ప్లేట్‌ను ఉపయోగిస్తారు. పచ్చని చెట్ల మధ్య ఏర్పాటుచేసుకున్న ఈ బస్ హౌస్ ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అయితే, ఆ బస్సు అక్కడ మాత్రమే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఆ బస్సులో వారు సుమారు అమెరికాలోని 16 స్టేట్స్‌ను చుట్టేశారు. దాని ఇంజిన్‌కు కూడా మరమ్మతులు జరిపి.. వారికి నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు.