ఆల్కహాల్ అధికంగా తాగితే శరీరానికి నష్టం. అదే పరిమితంగా తాగితే పెద్దగా ప్రభావం ఉండదు అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ అభిప్రాయం తప్పని చెబుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆల్కహాల్ ఒక్క స్పూను తాగినా కూడా అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, సురక్షితం కాదని హెచ్చరిస్తోంది. గ్లోబల్ హెల్త్ బాడీ ది లార్డ్ సెంట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ఇచ్చిన ఒక ప్రకటనలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐరోపాలో ప్రస్తుతం 200 మిలియన్ల మంది ఆల్కహాల్ కారణంగానే క్యాన్సర్ వచ్చే ప్రమాదంలో ఉన్నారని అని నివేదికలో తెలిపింది.


ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది. ఆడవారిలో అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఆల్కహాల్ లో ఉండే ఇథనాల్ శరీరంలోని సమ్మేళనాలు విచ్ఛిన్నం కాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల జీవక్రియ విధానాలకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎక్కువ తాగితే ప్రమాదం, తక్కువ తాగితే ఫర్వాలేదు... అనుకోవడానికి వీల్లేదని హెచ్చరిస్తోంది. శరీరంలో చేరిన ఆల్కహాల్ క్యాన్సర్ వ్యాధికి ట్రిగ్గర్ గా పనిచేస్తుందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచంలో అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఐరోపాలోని ప్రజలు అధికంగా ఆల్కహాల్ వినియోగిస్తున్నారని చెప్పింది. దీనివల్ల వచ్చే పదేళ్లలో 20 కోట్లకు పైగా ప్రజలు అక్కడ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. కాబట్టి ఆల్కహాల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తోంది. 


ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే మద్యం తాగిన వెంటనే రక్తంలో కలుస్తుంది. ప్రతి అవయవాన్ని త్వరగా చేరుతుంది. జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి ఇది సరిగా జీర్ణం కాదు. మెదడు, కాలేయానికి చేరుకుని త్వరగా మార్పులను చూపిస్తుంది. ఆల్కహాల్ కణాలను విచ్ఛిన్నం చేసేందుకు కాలేయం ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైముల వల్ల కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయ క్యాన్సర్, హెపటైటిస్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. 


మద్యం తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన త్వరగా పడతారు. దానికి కారణం మద్య పీయూష గ్రంధి నుంచి వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ వల్ల శరీరం లోని నీరు బయటికి పోతుంది. దీని వల్ల రక్తంలో నీరు శాతం కూడా తగ్గిపోతుంది. వెంటనే తలనొప్పి వస్తుంది. చివరకు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. 


Also read: మీకు థైరాయిడ్ ఉందా? అయితే రోజూ కొత్తిమీరను తినండి































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.