కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు నిరూపిస్తూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన పరిశోధన మతిమరుపుతో బాధపడుతున్న వారికి ఒక వరంలాంటిది అనే చెప్పుకోవచ్చు. ఎస్ప్రెస్సో కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలని నిరోధించవచ్చని ఇటాలియన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పానీయం మెదడు కణాలకు ప్రోటీన్ క్లంప్ లు విషపూరితం కాకుండా చేస్తుంది. దీని వల్ల చిత్త వైకల్యానికి దారి తీసే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. వేరొనా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మారియాపినా ది ఒనోఫ్రీయో ఈ అధ్యయనం గురించి కీలక విషయాలు వెల్లడించారు.


అల్జీమర్స్ అనేది టౌ, అమిలాయిడ్ తో సహా మెదడులోని ప్రోటీన్ నిర్మాణాల వల్ల సంభవిస్తుంది. మతిమరుపు సహా అనేక వ్యాధుల నుంచి రక్షించడానికి కాఫీ సహాయపడుతుందని మునుపటి అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకి మూడు నుంచి ఐదు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం 65 శాతం తగ్గిస్తుందని ఒక అధ్యయనం సూచించింది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం కాఫీలోని రసాయనాలు టౌ బిల్డ్ అప్ లని నిరోధించగలవా అని పరిశీలించారు. కాఫీలో ఉండే రెండు రసాయనాలు కెఫీన్, జెనిస్టీన్ లో టౌ ప్రోటీన్ ఉందో లేదో గమనించారు. అవి అల్జీమర్స్ లక్షణాలని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయని తేలింది. చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గించేందుకు మూడు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.


వినికిడి లోపం అధిగమించాలి: తేలికపాటి వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు చిత్త వైకల్యం వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మితమైన వినికిడి లోపం ఉనగే వారికి మూడు రెట్లు పెరుగుతుంది. వినికిడి లోపం సమస్య వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించుకునే పరికరాలు ధరించడం వలన ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


డిప్రెషన్ కి చికిత్స: డిప్రెషన్ కి గురైన వ్యక్తుల్లో డీమెన్షియా వచ్చే ప్రమాదం 70 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక మిడిల్ ఏజ్ నుంచి డిప్రెషన్ కి గురైన వారిలో ఈ ప్రమాదం 80 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు డిప్రెషన్ నుంచి బయట పడాలి. లేదంటే మతిమరుపు సమస్య అధికమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


ఒంటరితనం వద్దు: ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ గడిపేస్తారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఒంటరితనం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడుతూ బాధ, సంతోషంగ, దుఖం పంచుకోవడం వల్ల మనసు తెలికపడటం మాత్రమే కాదు ఒంటరి అనే భావన కూడా ఉండదు. హాయిగా జీవించవచ్చు. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకోవద్దు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? కంగారు వద్దు, ఇంట్లోనే చికిత్స చేయండిలా!


Join Us on Telegram:https://t.me/abpdesamofficial