KYC Update in PF Account : ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో (PF Account) పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులున్నాయా? అయితే ఇక నుంచి ఆ తప్పులు సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కూడా KYCని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ పనిని సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

డబ్బుతో పాటు పెన్షన్ 

ఉద్యోగం చేసే వారందరికీ EPFO గురించి బాగా తెలుసు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు.. పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం పొందడానికి EPF హెల్ప్ చేస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు.. వారు EPF నుంచి ఒకేసారి డబ్బుతో పాటు.. పెన్షన్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. అయితే మీ EPF ఖాతాలో పేరు లేదా పుట్టిన తేదీలో ఏదైనా మార్పులు ఉంటే.. దానిని అప్​డేట్ చేయాలనుకుంటే మీరు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. 

ఇలా అప్​డేట్ చేసేసుకోండి..

కొన్నిసార్లు పీఎఫ్ ఖాతాల్లో కూడా తప్పులు జరుగుతాయి. పేరు లేదా పుట్టిన తేదీ వంటివి తప్పుగా అప్‌లోడ్ అవుతాయి. అటువంటి పరిస్థితిలో దీన్ని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో డబ్బు విత్‌డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈ అప్‌డేట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీరు యూనిఫైడ్ పోర్టల్‌కి వెళ్లి తప్పును సరిదిద్దుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో దీన్ని చేయవచ్చు. దశల వారీగా ఎలా చేయాలో చూసేద్దాం.

EPF ఖాతాలోని తప్పులను సవరించడానికి.. ముందుగా మీ పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా పాఠశాల-కళాశాల సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలి. దీని ఆధారంగా మార్పులు చేయవచ్చు. ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినదై ఉండాలి. పాస్‌పోర్ట్ లేదా ప్రభుత్వ విభాగం జారీ చేసిన ఇతర పత్రాలు ఉండాలి. మీకు ఎలాంటి పత్రాలు లేకపోతే.. మీరు వైద్య ధృవీకరణ పత్రం, తగిన కోర్టు అఫిడవిట్‌ను ఉపయోగించుకోవచ్చు.

KYCని ఎలా సవరించాలి

ముందుగా పుట్టిన తేదీని సవరించడానికి.. మీరు https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత UAN, పాస్‌వర్డ్ ఇవ్వాలి. తర్వాత వచ్చే క్యాప్చాని ఎంటర్ చేయండి. సైన్ ఇన్​పై క్లిక్ చేయాలి. మేనేజ్‌పై క్లిక్ చేసి.. ఆపై బేసిక్ వివరాలను సవరించుపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ నంబర్ ప్రకారం మీ సరైన పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి.. సేవ్ లేదా సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యజమానిని పేరు మార్పు అభ్యర్థనను స్వీకరించమని చెప్పాలి. 

ఇంట్లో కూర్చొని KYCని ఎలా అప్‌డేట్ చేయాలి

EPF ఖాతాలో KYCని అప్‌డేట్ చేయడానికి.. మీరు EPFO ​​అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత నిర్వహణ విభాగానికి వెళ్లి KYC ఎంపికను ఎంచుకోవాలి. ఇప్పుడు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు ధృవీకరణ కోసం మీ యజమానికి మీ అభ్యర్థనను సమర్పించాలి.