మీకు గుర్తుందా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates)లోనే అతి పెద్ద విమానయాన సంస్థ ‘ఎమిరేట్స్’ కోసం అత్యంత ఎత్తైన బుర్జ్ ఖాలిఫా భవన శిఖరంపై నిలుచుని ఔరా అనిపించిన మహిళ.. మళ్లీ అదే సాహసం చేసింది. అయితే, ఈ సారి.. మరింత థ్రిల్లింగ్ వీడియోతో ముందుకొచ్చింది. ఈ ప్రకటనలో కేవలం ఆమె మాత్రమే కాదు.. ఆమె చుట్టు తిరుగుతున్న A380 ఎయిర్ బస్ విమానాన్ని కూడా చూడవచ్చు.
అయితే, ఈ సాహసాన్ని మాటల్లో చెప్పడం కష్టమే. ఇదివరకు ఆమె విమానయాన సంస్థ ప్రమోషన్ కోసం నిలుచుంది. ఆ విమాన సంస్థ ప్రత్యేకతలను వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించింది. ఈసారి ఆమె ‘దుబాయ్’ ఎక్స్‌పో ప్రమోషన్ కోసం మరోసారి బుర్జ్ ఖలిఫా భవనం పైకి ఎక్కింది. భవనం పైన.. కాలు పెట్టడానికి కూడా చోటులేనంత చిన్న ప్రాంతంలో నిలుచుని ఆమె దుబాయ్ ఎక్స్‌పో గురించి ప్రకార్డులు ప్రదర్శించింది. అదే సమయంలో ఆమె వెనుక నుంచి ‘Dubai Expo’ అని రాసివున్న A380 విమానం చక్కర్లు కొట్టింది. ఈ దృశ్యాన్ని చూస్తే తప్పకుండా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఈ ఎక్స్‌పో మార్చి నెలలో ముగియనుంది. ఈ సందర్భంగా పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం ఎమిరేట్స్ మరోసారి ఈ ప్రకటనతో ముందుకొచ్చింది.
కనీసం నిలుచోడానికి కూడా స్థానం లేని ఆ ఎత్తైన ప్రదేశంలో నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ స్టంట్ చేసిన నికోలే స్మిత్ లుడ్విక్.. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇస్ట్రక్టర్ కావడంతో అంత ఎత్తులో నిలబడినా పెద్దగా భయపడలేదు. అంతేగాక.. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా సేఫ్టీ నిబంధనలు పాటించారు. ఒక్క నిమిషం నిడివి గల ఈ ప్రకటన మరోసారి వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఆమె సమీపం నుంచి 2,700 ఎత్తుతో విమానాన్ని నడపడం అంటే మాటలు కాదని, అది చాలా డేరింగ్ స్టంట్ అని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.
మేకింగ్ వీడియో: