సుగంధ ద్రవ్యాల ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణ కలిగినది కుంకుమ పువ్వు. అందుకే దీన్ని గోల్డెన్ స్పైస్ అని పిలుస్తారు. క్రోకస్ సాటివస్ పువ్వు నుంచి కుంకుమ పువ్వు సేకరిస్తారు. ఇది రుచిని పెంచడమే కాదు అందమైన కలర్, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అద్భుతమైన వాసన, ప్రకాశవంతమైన రంగు దీని ప్రత్యేకత. ఈ బంగారు వర్ణం మసాలా హిమాలయాల్లో ప్రత్యేకంగా పండుతుంది. అందుకే దీని ఖరీదు కూడా ఎక్కువ. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవేంటంటే..
మానసిక స్థితి
క్రోసిన్, సఫ్రనల్ వంటి పదార్థాలను పుష్కలంగా కలిగి ఉండే కుంకుమ పువ్వు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. భావోద్వేగాలని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ విడుదలని ప్రేరేపిస్తుంది. ఇది నిస్పృహ లక్షణాలని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడి ఎదుర్కొంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు.
జీర్ణక్రియ
మెరుగైన జీర్ణక్రియకి కుంకుమ పువ్వు ఎంతగానో దోహదపడుతుంది. పొట్టలోని ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ను నయం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. పొట్టలో అసౌకర్యం, ఉబ్బరం సమస్యల్ని తగ్గించి జీర్ణక్రియకి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్
శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి న్యూరోలాజికల్ వ్యాధులని ఎదుర్కొంటుంది. శరీరంపై హానికరమైన ప్రభావాలని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ శక్తి మెదడు, నాడీ వ్యవస్థ చుట్టు ఒక రక్షణ పొర ఏర్పరుస్తుంది. మెదడు దెబ్బతినకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
రోగనిరోధక వ్యవస్థ
ఆహారంలో కుంకుమ పువ్వు చేర్చుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకుంటే రోగాల నుంచి త్వరగా కోలుకోవచ్చు.
బరువు నిర్వహణ
బరువు నిర్వహణలో కుంకుమ పువ్వు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలని నియంత్రిస్తుంది. కోరికలు తగ్గించి పొట్ట నిండిన సంతృప్తి భావన కలిగిస్తుంది. ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. బరువు అదుపులో ఉండేందుకు దోహదపడుతుంది.
గుండె ఆరోగ్యం
కుంకుమ పువ్వు కార్డియోవాస్కులర్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తపోటుని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిల్ని ఇస్తుంది. ఇందులోని క్రోసెటిన్ అనే సమ్మేళనం రక్త నాళాలని విస్తరించేలా చేస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెకి అద్భుతమైన ఎంపిక కుంకుమ పువ్వు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ
అనేక దీర్ఘకాలిక వ్యాధులు వాపుతో ముడి పడి ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి కుంకుమ పువ్వు సహాయకారిగా ఉంటుంది. ఇందులోని శోధ నిరోధక ప్రభావాలు ఆర్థరైటిస్ సహ అనేక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రుతు తిమ్మిరిని నయం చేస్తాయి.
కంటి ఆరోగ్యం
రెటీనా పని తీరుకి కుంకుమ పువ్వు మెరుగ్గా పని చేస్తుంది. అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేశాయి. వయసు సంబంధిత కంటి మచ్చలు రాకుండా చూస్తుంది. ఇది కేవలం ఒక మసాలా కాదు జీవ నాణ్యతని మెరుగుపరిచే ఒక అద్భుతమైన ఔషధం లాంటిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? జాగ్రత్త మతిమరుపు రావడం ఖాయం