గుడ్డుతో చేసిన వంటకాలంటే చెవి కోసుకునేవారు ఎంతో మంది. ఆమ్లెట్ నుంచి కూరల దాకా ఎన్నో రకాల వంటకాలు చేయచ్చు. అందులో ఎగ్ ఛాట్ కూడా ఒకటి. శీతాకాలంలో చల్లని వాతావరణంలో ఈ ఎగ్ ఛాట్ తింటే ఆ రుచే వేరు. చేయడం కూడా చాలా సులువు. పిల్లలకు పెడితే చాలా బలం కూడా. 


కావాల్సిన పదార్థాలు
ఉడకబెట్టిన గుడ్లు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
టమోటోలు - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - రెండు
కారం - అరస్పూను
పసుపు - పావు స్పూను
ఛాట్ మసాలా - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - తగినంత
పుదీనా తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
నూనె - రెండు స్పూనులు


తయారీ ఇలా
1. ఉడకబెట్టిన గుడ్లను పెంకులు ఒలిచి, చందమామ, తెల్ల భాగం వేరు చేయాలి. చందమామను పొడిలా చేయాలి. తెల్ల భాగాన్ని కాస్త పెద్ద ముక్కల్లా కట్ చేయాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కా పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు, టొమాటో తరుగు వేసి వేయించాలి. 
3. అవి బాగా వేగాక కారం, పసుపు, ఛాట్ మసాలా, ఉప్పు వేసి కలపాలి. 
4. ఆ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. 
5. కూరలా మగ్గాక అందులో పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలపాలి. 
6. తరువాత పొడిలా చేసుకున్న చందమామను వేసి కలపాలి. చివర్లో తెల్లగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలపాలి. 
7. అంటే టేస్టీ ఎగ్ ఛాట్ రెడీ అయినట్టే. ఒకసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది.  


కచ్చితంగా తినాల్సిందే...
గుడ్లు కచ్చితంగా తినాల్సిందేనని చెబుతారు వైద్యులు. మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు ఇందులో ఉన్నాయి. అందుకే కోడి గుడ్డు రోజుకొకటి తింటే ఎంతో మంచిది. ఒక మనిషికి ఏడాదికి 320 గుడ్లు తినవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే కేవలం ఇక గుడ్డులోనే 44 ధాతువులు ఉన్నాయి. ఒక పచ్చసొనలో 12 రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. రోజుకో గుడ్డు తినడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు. ప్రతి రోజు గుడ్డు తినడం వల్ల 50 శాతం ఇస్కీమిక్ స్ట్రోక్ రాకుండా, 80 శాతం కార్డియాక్ అరెస్టు రాకుండా, 75 శాతం కార్డియో వాస్కులర్ వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. 






Also read: పంజాబీ స్లైల్లో చపాతీపై నెయ్యి రాసుకుని తింటున్నారా? ఇది ఆరోగ్యకరమేనా?