దోసకాయ అంటే ఎంతోమందికి ఇష్టం. ముఖ్యంగా అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఇది వరమనే చెప్పాలి. ఇక వేసవి వచ్చిందంటే దీని అమ్మకాలు మామూలుగా ఉండవు. సలాడ్లు తినేవారికి కచ్చితంగా ఉండాల్సిన కూరగాయ ఇది. సలాడ్ రూపంలో దీన్ని అధికంగా తింటారు. ఇది తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కానీ అధికంగా తినడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి. రోజూ అధిక మొత్తంలో తినేవారికి కొన్ని సమస్యలు రావచ్చు. 


అలెర్జీలు
కొన్నిరకాల దోసకాయలు చేదుగా ఉంటాయి. వీటిని తినకపోవడమే మంచిది. ఇందులో కుకుర్బిటాసిన్లు, టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనియోయిడ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి దోసకాయలను చేదుగా మారుస్తాయి. అలాగే ఇవి విష రసాయనాల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి హానికరంగా మారవచ్. ఒక్కోసారి ప్రాణాంతకమైన అరుదైన అలెర్జీలు 
వచ్చేలా చేస్తాయి. 


డీహైడ్రేషన్...
దోసకాయ తింటే డీహైడ్రేషన్ బారిన పడరు అంటారు. మితంగా తిన్నప్పుడు ఇది నిజమే కానీ అధికంగా తిన్నప్పుడు ఇది డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. దోసకాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో కుకుర్బిటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అధికంగా మూత్ర విసర్జనకు వెళ్లేలా చేస్తుంది. అప్పుడు మన శరీరం నుంచి అధిక స్థాయిలో నీరు బయటికి పోతుంది. నిర్జలీకరణానికి దారి తీస్తుంది. కాబట్టి రోజుకు ఒకట్రెండు దోసకాయలు చాలు. అధికంగా తింటే సమస్యలు వస్తాయి. 


కిడ్నీలపై ప్రభావం
దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం తగిన స్థాయిలో ఉంటే రక్తపోటు సమస్యలను నివారించి, రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. కానీ అధిక పొటాషియం శరీరంలో చేరితే హైపర్ కలేమియా వంటి ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. ఇది ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ సమస్యలు వచ్చి మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒకేసారి అధిక మొత్తంలో దోసకాలను తినకూడదు. 


రక్తనాళాల ఆరోగ్యం
దోసకాయల్లో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది. దోసకాయలు అధికంగా తినడం వల్ల రక్తంలో నీరు రక్తంలో చేరి రక్తం పరిమాణాన్ని పెంచేస్తుంది. ఇలా పెరగడం వల్ల గుండెకు రక్తాన్ని పంపింగ్ చేసే రక్త నాళాలపై ఒత్తిడి పడుతుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది.  అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను దెబ్బతీస్తుంది. 


Also read: వీడియో గేమ్స్ ఆడే పిల్లలు జాగ్రత్త, వారిలో ప్రాణాంతక పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.