పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, నూడుల్స్... ఇలా జంక్ పుడ్ జాబితా పెద్దదే. ఎక్కువగా వీటిని పిల్లలు, టీనేజర్ల, యువత ఇష్టపడుతుంటారు. అంటే వీరిలో సగం మంది రేపటితరమే. రేపటి పౌరులు చిన్నప్పట్నించే ఇలా అనరోగ్యకరమైన ఆహారాలకు అలవాటుపడుతుంటే భావి భారతమంతా ఊబకాయంతో నిండిపోతుందేమో. అందుకే జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలి. అందు కోసం మూడు రకాల ఆహారాలు తరచూ తినిపిస్తుంటే వారిలో జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. 


బాదం పప్పులు
ఈ నట్స్ చాలా ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి కూడా. ఇవి డబ్బాలో వేసుకుంటే ఎన్ని రోజులైన నిల్వ ఉంటాయి. కాబట్టి వీటిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్ ఇ, మెగ్నిషియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఇ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగిఉంటుంది. లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధన ప్రకారం ఆకలి నియంత్రించడంలో బాదం సమర్థవంతంగా పనిచేస్తుంది. బాదం పప్పులను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే అధిక కొవ్వు పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది. జంక్ ఫుడ్ లో అంతా అధిక కొవ్వే. ఇది వారి బరువు పెరగకుండా కాపాడుతుంది. 


పండ్లు
తాజా పండ్లు తరచూ తినేవారిలో కూడా జంక్ ఫుడ్ ను చూడగానే ఏవగింపు కలుగుతుంది. తినాలన్న కోరిక పుట్టదు. అరటిపండ్లు, ఆపిల్స్, బెర్రీలు వంటివి జంక్ ఫుడ్ ను అడ్డుకోవడంలో ఉత్తమ ప్రత్నామ్నాయాలు. పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం తాలూకు గొప్ప మూలం. ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. 


పెరుగు
పెరుగు పిల్లలకు, పెద్దలకూ ఇద్దరికీ ముఖ్యమైనది. కండరాలకు ప్రొటీన్, కాల్షియంలను అందిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నిషియం కూడా దీనిలో లభిస్తాయి. దీనితో పాటూ పొట్ట, పేగుల ఆరోగ్యానికి అవసరమైన ప్రొబయోటిక్ బ్యాక్టిరియా కూడా ఇందులో అధికం. పెరుగును రోజూ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అధిక కొవ్వులు, కెలోరీలు ఉండే ఆహారాలను తినాలన్న కోరిక తగ్గిపోతుంది. అందుకే పెరుగును రోజుకు రెండు పూటలా పిల్లల చేత తినిపించాలి. 


జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు?
జంక్ ఫుడ్ లో  సంతృప్త కొవ్వులు, అధిక సోడియం, షుగర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల అనేక రోగాలు దాడి చేస్తాయి. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం వంటివి అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇవి మెదడును తీవ్రంగా ఉత్తేజబరుస్తాయి. దీనివల్ల అవసరమైనదాని కన్నా అధికంగా తినేస్తాము. అంతేకాదు కోపం, చిరాకు వంటివి కూడా పెరిగిపోతాయి. కాబట్టి జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 


Also read: డయాబెటిస్ ఉన్న వారు వేరుశెనగపలుకులతో చేసిన వంటకాలు తినవచ్చా?


Also read: తక్కువ జీఐ ఉండే ఆహార పదార్థాలు ఇవే, వీటిని తింటే డయాబెటిక్ రోగులు సేఫ్