చాలా మంది చెరువు చేపలనే తింటారు. గ్రామాల్లో ఉండేవారికి పూర్తిగా చెరువు చేపలే ఆధారం. అయితే చేపలు పెరిగే నీళ్లను బట్టి కూడా వాటికి కొన్ని సుగుణాలు, పోషక శక్తి వస్తుంది. సముద్రపు చేపను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు కానీ వారానికోసారైనా వీటిని తింటే చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకి ఇవి చాలా మేలు చేస్తాయి.
కంటికి...
సముద్రపు చేపుల కంటి చూపును ఎంతో మెరుగుపరుస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటి చూపు మందగించడం, రేచీకటి వంటి సమస్యలు రావు.
గుండెకు...
ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని చెప్పాం కదా, అవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. వారానికోసారి వీటిని తిన్నా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎంతో కొంత తగ్గుతుంది.
ఆర్ధరైటిస్
మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ చేపలు ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. సముద్రపు చేపల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది శరీరం కాల్షియాన్ని శోషించుకునేలా చేస్తుంది. రుమటాయిల్ ఆర్థరైటిస్ ఉన్నవారు సముద్రపు చేపలు తింటే చాలా మంచిది.
డిప్రెషన్
విపరీతమైన ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి సముద్రపు చేపలు చాలా మేలు చేస్తాయి. వీటిని తరచూ తింటుంటే ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. తద్వారా డిప్రెషన్ కూడా తగ్గుతుంది.
అందానికి...
చర్మసౌందర్యం పెంచేందుకు కూడా ఈ చేపలు అవసరం. హానికరమైన కిరణాల నుంచి తనను తాను రక్షించుకునే శక్తి చర్మానికి వస్తుంది. మొటిమలు కూడా తగ్గుతాయి. ఇతర చర్మ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తగ్గుతాయి.
జ్ఞాపకశక్తికి...
ఈ చేపలు తరచూ తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలు ఈ చేపలు పెడితే చాలా మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసు మీరాక కూడా అల్జీమర్స్ వ్యాధి త్వరగా రాదు.
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెరువు చేపల్లో ఉండవా?
ఏ చేపల్లో అయినా ఉంటాయి, కాని సముద్రపు చేపల్లో అధికంగా ఉంటాయి.చెరుపు చేపల్లో రైతు వేసిన ఆహారం తినే అవి బతుకుతాయి. ఇక గ్రామాల్లోని చెరువుల్లో పెరిగే చేపలకు తినేందుకు రకరకాల ఆకులు, మొక్కలు దొరకవు. కానీ సముద్రంలో రకరకాల మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న మొక్కలు ఉంటాయి. వాటిని చిన్నచిన్న చేపలు తింటాయి. ఆ చేపల్ని పెద్ద చేపలు, ఆ పెద్ద చేపల్ని ఇంకా పెద్ద చేపలు తింటాయి. ఇలా ఒకదాని నుంచి ఒకటిగా అన్ని చేపల్లోనూ ఈ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సముద్రంలో జీవ వైవిధ్యం చాలా అధికం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.