మగవారిలో పునరుత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీర్య కణాల సంఖ్య తగ్గి, వాటిల్లో చలనశీలత కూడా తగ్గుతోంది. దీంతో గర్భధారణకు వీర్యకణాలు సహకరించవు. దీనివల్ల పిల్లలు కలగక ఎంతో మంది మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అయితే సాంప్రదాయక బద్దమైన ఓ ఇండియన్ స్వీట్ ఆ సమస్యలకు చెక్ పెడుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేకాదు ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది ఈ స్వీట్. ఈ మిఠాయి పేరు ‘గుల్కండ్’. దీన్ని పాన్‌లో లేదా తమలపాకులో చుట్టి భోజనం చేశాక తింటుంటారు చాలా మంది. అధిక శాతం మంది గుల్కండ్ లేకుండానే తినేస్తుంటారు. దీన్ని తమలపాకులో ఒక స్పూను వేసుకుని తినడం వల్ల చాలా మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. 


ఏంటిది?
గుల్కండ్ అనేద గులాబీ రేకులు, చక్కెర కలిపి చేసే ఒక స్వీట్. ఇది జిగటగా జామ్‌లా ఉంటుంది. దీన్ని నేరుగా తిన్నా బావుంటుంది. లేదా కిళ్లీల్లో కలుపుకుని తినడం వల్ల మంచి రుచిగా ఉంటుంది. గుల్కండ్ ఒకసారి తయారుచేసుకుంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది. 


తయారీ ఇలా..
నోరు వెడల్పుగా ఉండే ఒక గాజు కూజాలో గులాబీ రేకులు, చక్కెర లేదా తేనే కలపాలి. కొన్ని గులాబీరేకులు వేశాక పంచదార చల్లాలి, మరో పొర గులాబీ రేకులు చల్లాక మళ్లీ పంచదార చల్లుకోవాలి. ఇలా పొరలుపొరలుగా వేసుకుని మూత పెట్టేయాలి. ప్రతిరోజూ సూర్య కాంతి తగలేలా మూడు నుంచి నాలుగు వారాల పాటూ ఉంచాలి.ఆ తరువాత చూస్తే జామ్‌లాంటి గుల్కంద్ సిద్ధమైపోతుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. 


చలువ చేస్తుంది...
గుల్కంద్ తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇది సహజ శీతలకారిణి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో గుల్కంద్ తినడం వల్ల చాలా చలువు చేస్తుంది. లస్సీలాంటివాటిలో దీన్ని కలుపుకుని తాగితే చాలా మంచిది. కళ్లు తిరగడం, ముక్కులోంచి రక్తం రావడం, వడదెబ్బ వంటి వాటి నుంచి ఇది కాపాడుతుంది. 


జీర్ణక్రియకు..
గుల్కంద్ స్వీట్ రోజుకు ఇక స్పూను తిన్నా చాలు జీర్ణక్రియను ఎంతో మేలు చేస్తుంది. పొట్ట ఉబ్బరం, తేనుపులు, గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలకు చికిత్స చేస్తుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారు గుల్కంద్ తింటే మంచిది. 


దగ్గు, జలుబులు...
దగ్గు, జలుబు బారిన తరచూ పడుతుంటే గుల్కంద్ తినండి. ఈ సూపర్ ఫుడ్ గొంతుపై చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. దగ్గును తగ్గిస్తుంది. జలుబు, దగ్గు త్వరగా తగ్గేలా చేస్తుంది. 


నొప్పి తగ్గేలా...
గుల్కంద్ లోని గుణాలు నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అందులో ఉంటే క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్ వంటి పదార్థాలు , గులాబీ రేకులలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు నొప్పిని తగ్గించడానికి సహకరిస్తాయి. 


బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు 
గుల్కంద్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికమని ముందే చెప్పాం కదా, అవి  బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతాయి.


స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు
మగవారు గుల్కండ్ తినడం చాలా అవసరం. లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది వీర్య కణాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది పునరుత్పత్తి అవయవాల కండరాలను సడలిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అన్ని శరీర కణాలకు మరింత ఆక్సిజన్, శక్తిని అందిస్తుంది.


Also read: సూపర్ మార్కెట్లో రిఫ్రిరేటర్లో పెట్టి అమ్మే ఈ ఆహారాలను కొనకుంటేనే బెటర్








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.