హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డారు. దీంతో ఆయన కోలుకునే వరకు హోస్ట్‌ను మార్చారు. కాస్త చల్లని వాతావరణం వచ్చిందంటే చాలు డెంగ్యూ రెచ్చిపోతుంది. ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందే ఈ జ్వరంతో బాధపడుతున్నారు. డెంగ్యూ సోకినప్పుడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ జ్వరానే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఆడ ఏడెస్ దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది.
బలహీనంగా మార్చి...
డెంగ్యూ భయంకరమైన జ్వరంగా చెప్పాలి. ఎందుకంటే ఈ వైరస్ శరీరాన్ని బలహీన పరిచేందుకు చూస్తుంది. ప్లేట్ లెట్లను నాశనం చేస్తుంది. దీని వల్ల సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కోసారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైనది. అందుకే జ్వరం రాగానే అది డెంగ్యూయేమో చెక్ చేయించుకోవాలి.
ఈ జ్వరం నుంచి త్వరగా రికవరీ అవ్వాలంటే ప్లేట్ లెట్స్ పడిపోకుండా కాపాడుకోవాలి. అందుకు మంచి ఆహారం తినాలి. ముఖ్యంగా వైద్యులు కివీ పండ్లు తినమని సూచిస్తారు. డెంగ్యూ జ్వరం వచ్చి కోలుకున్నాక కూడా కనీసం నెల రోజుల పాటూ రోజూ కివీ పండ్లు రెండైనా తినాలి. అప్పుడే శరీరం తిరిగి పూర్తిస్థాయిలో కోలుకుంటుంది.
కివీ పండ్లు ప్రయోజనాలు
1. కివీలో అధిక స్థాయిలో విటమిన్ సి, డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వైరస్‌తో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇందులో విటమిన్ సి రోజువారీ మనకు కావాల్సిన దానికన్నా 230 శాతం అధికం. అందుకే డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
2. దీన్ని తినడం వల్ల రక్తపోటు పెరగదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి తగ్గుతాయి. చెడె కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది.
3. జీర్ణక్రియకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర సమస్యలను తొలగిస్తుంది.
4. గురకకు కూడా చికిత్స చేస్తుంది. ఆస్తమా రోగులకు గురక వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ఉండే విటమిన్ సి దాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.
5. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉంటే కెరోటినాయిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
Also read: ఆస్తమా ఉన్న పిల్లలను బాణాసంచా కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.