మద్యం తాగే అలవాటున్న వారు ఎంత చెప్పినా తాగకుండా ఉండలేకపోతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం చెడిపోతున్నా కూడా లెక్క చేయడం లేదు. అలాంటి వారి కోసమే ఈ కథనం. రోజూ ఆల్కహాల్ తాగకుండా ఉండలేని వారు కనీసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు. మద్యంతాగే కింద చెప్పిన ఆహారాలను తినడం వల్ల మేలు జరుగుతుంది. అప్పటికే కొంత కడుపునిండటం వల్ల తక్కువ తాగుతారు, అలాగే ఆల్కహాల్ వల్ల వెంటనే శరీరంపై పడే ప్రభావాలను ఇవి కొంతమేరకు తగ్గిస్తాయి. ముఖ్యంగా ఉబ్బరం, నిర్జలీకరణం, గుండెల్లో మంట, అజీర్ణాన్ని నివారించడానికి ఇవి సహకరిస్తాయి. 


గుడ్లు
వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆల్కహాల్ తాగడానికి ముందే ఉడికించిన గుడ్లను లేదా ఆమ్లెట్‌ను తినేయాలి. దీని వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించలేరు. 


అరటిపండు
అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రెండు అరటిపండ్లు తిన్నాక ఆల్కహాల్ తాగితే అది చేసే హాని ఎంతోకొంత తగ్గుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఏర్పడకుండా అరటి పండు కాపాడుతుంది. రక్తంలోకి ఆల్కహాల్ శోషణ కూడా మందగిస్తుంది. 


సాల్మన్ చేపలు
ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరం శోషించుకోకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాలీ ఆమ్లాలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. సాల్మన్ చేపలో ఇవి అధికంగా ఉంటాయి. 


పెరుగు
కప్పు పెరుగులో ప్రోటీన్లు, మంచి కొవ్వులు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి ఆల్కహాల్ తాగకముందు పెరుగు తినడం వల్ల దాని చెడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. 


చిలగడదుంపలు
ఈ దుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ తీసుకునే ముందు వాటిని తినడం వల్ల సంక్షిష్ట కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదిగా సాగేలా చేస్తుంది. 


చియా విత్తనాలు
చియా విత్తనాలు గుప్పెడు తిన్నాక ఆల్కహాల్ తాగితే ఆరోగ్యానికి ఎంతో కొంత రక్షణ లభిస్తుంది. వీటిలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆల్కహాల్ శోషణను మందగించేలా చేస్తాయి.  





గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.





Also read: కదలకుండా గంటలుగంటలు టీవీ చూసే వారికి హెచ్చరిక... ఆ సైలెంట్ కిల్లర్ చంపేయచ్చు


Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు


Also read: ఆ రోగులలో కేవలం శ్వాసఆడకపోవడమే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉండే అవకాశం... చెబుతున్న కొత్త అధ్యయనం