మన ఇళ్ళల్లో చాలా మంది ఆహారం మిగిలిపోతే మరుసటి రోజు తింటూ ఉంటారు. ఇక కూరలు అయితే వాటిని ఫ్రిజ్ పెట్టుకుని మళ్ళీ తినాలి అనుకున్నప్పుడు వేడి చేసుకుని తింటారు. కానీ అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని దాని వల్ల సోమరితనం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బయట నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఏం వంట చేసుకుంటాంలే మిగిలిపోయిన ఆహారం ఉంది కదా అనుకుని దాన్ని తినేస్తారు. మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చెయ్యడానికి అందరూ ఉపయోగించే ఒకే ఒక పద్ధతి ఫ్రిజ్ లో పెట్టేయడమే. కానీ ఎక్కువ కాలం పాటు ఆహారాన్ని తాజాగా ఉంచడానికి ఇది ఎప్పుడు ఉత్తమ ఎంపిక కాదు. మిగిలిపోయిన ఆహారం ఎక్కువగా పెడుతూ ఉండటం వల్ల ఫ్రిజ్ పేరు కాస్త ‘సద్ది పెట్టె’ అయిపోయింది.


సోమరితనం ఎలా వస్తుంది?


మిగిలిపోయిన ఆహారం ఫ్రిజ్ లో 48 గంటలు మాత్రమే తాజాగా ఉంటుందని ఆ తర్వాత దాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వెల్లడించారు. అంతే కాదు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల సోమరితనం కూడా వస్తుంది. నిల్వ చేసిన ఆహారం ఎక్కువ సార్లు వేడి చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి శక్తిని అందించదు. అలాగే మూడ్ బూస్టర్ ఇచ్చేందుకు సహకరించదు. ఇది చివరకి నిరాశ, సోమరిగా మార్చేస్తుంది. ఆహారం వండిన 3 గంటల్లోపు దాన్ని తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని అతిగా వేడి చేయడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. అంతే కాదు దాని రుచి ఆకృతి కూడా మారిపోతుందని అంటున్నారు. నిల్వ చేసిన పదార్థాలు తినడం వల్ల ఒక్కోసారి ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.


ఆహారం ఎందుకు చెడిపోతుంది?


ఆహారం ఎందుకు చెడిపోతుందనే విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిరూపించలేకపోయారు. కానీ ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉండటం వల్ల దాని మీద ఒక రకమైన బ్యాక్టీరియా చేరి ఫంగస్ ఏర్పడుతుంది. ఆహారాన్ని చాలా సార్లు వేడిచేసినప్పుడు అందులోని రసాయన నిర్మాణాల్లో మార్పులు వస్తాయి. ఈ రసాయన మార్పులు కొన్ని ఆహారాన్ని గట్టి పరుస్తాయి. మరికొన్ని మృదువుగా, క్రంచి స్వభావాన్ని కోల్పోతాయి.


ఆహారం చెడిపోయిందని గుర్తించడం ఎలా?


రంగు, వాసన, ఆకృతి మారిపోతే ఆ ఆహారం చెడిపోయినట్లు భావించాలి. ఫ్రిజ్ లో మిగిలిపోయిన ఆహారం రంగు మారితే మాత్రం అది చెడిపోయినట్లే లెక్క. 48 గంటల కంటే ఎక్కువ సేపు నిల్వ చేస్తే ఆ ఆహారం పుల్లని వాసన వస్తుంది. కుళ్లిపోవడం వల్ల వండిన ఆహారం నీరుగారుతున్నట్టుగా కనిపిస్తుంది.


ఇవి తినండి


తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రుచికరమైన ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి లేకపోతే పాప్ కార్న్, చిక్ పీస్, అరటిపండు, బెర్రీలు వేసుకుని పెరుగు, పోహా వంటివి చేసుకుని తినొచ్చు. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పిల్లలకు చెప్పులేయొద్దు, కాసేపు పాదాలను నేలను తాకనివ్వండి - ఎందుకంటే..