వేసవి వచ్చిందంటే టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలు రెచ్చిపోతాయి. ఇక చల్లని చినుకులు మొదలయ్యాయంటే డెంగ్యూ, డయేరియా, హెపటైటిస్ ఎ వంటివి రావడానికి సిద్ధంగా ఉంటాయి. చలికాలంలో అందరూ జలుబు, దగ్గు, జ్వరం, నిమోనియా వంటివే వస్తాయని అనుకుంటారు. కానీ నివురు గప్పిన నిప్పులా గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అందులోనూ ముఖ్యంగా చలికాలంలో తెల్లవారుజామున గుండె పోటు కేసులు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు వైద్యులు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ వైద్యులు. వారు చెప్పిన ప్రకారం ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమైనప్పుడు,గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చలికాలంలోనే ఎందుకు?
ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల కనిపించినప్పుడు గుండె ఆరోగ్యం కూడా దిగజారుతుంది. రక్తపోటు సాధారణంగా లేకుండా హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా, లేక గుండె కొట్టుకునే వేగం పెరిగినా, తగ్గినా మీరు చల్లని వాతావరణంలో బయటికి వెళ్లకూడదు. వెచ్చని ప్రదేశంలో లేదా రెండు మూడు దుప్పట్లు కప్పుకుని శరీరానికి వెచ్చదనం వచ్చేలా చేయాలి. చలికాలంలో పొగమంచు వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వయసులో పెద్దవారు, గుండె సమస్యలు ఉన్నవారు పొగమంచుకు దూరంగా ఉండాలి. చల్లగాలి, చల్లని వాతావరణ లేకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేసవిలో మీరు తాగే నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. కానీ చలికాలంలో అధికంగా నీరు తాగడం వల్ల గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది.చల్లని వాతావరణంలో చెమట పట్టదు. దీంతో ద్రవాలు ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండిపోతాయి. దీని వల్ల శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఈ పరిస్థితి చివరికి గుండెకు చేటు చేస్తుంది.
విటమిన్ డి లేక...
శీతాకాలంలో ఎంతో మందికి విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. కారణం సూర్యరశ్మి తక్కువ తగలడమే. విటమిన్ డి తగ్గడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె పోటు వచ్చాక గుండె ఆగిపోకుండా కాపాడేందుకు విటమిన్ డి చాలా అవసరం. చలికాలంలో విటమిన్ డి తగ్గకుండా ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలోనైనా తీసుకోవాలి.
కొన్ని జాగ్రత్తలు...
చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. చలికాలంలో ఎక్కువ చెమట పట్టదు కాబట్టి నీరు, ఉప్పు వినియోగాన్ని తగ్గించడం మంచిది.
2. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం చేయద్దు. వ్యాయామం, వాకింగ్ వంటివి చేయాలి.
3. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు వైద్యులు చెప్పిన మేరకు మందులు కచ్చితంగా వాడాలి.
Also read: ఐరన్ మాత్రలు మింగుతున్నారా? అవి ఎప్పుడు వేసుకుంటే సమర్థంగా పనిచేస్తాయో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.