Dussehra Navaratri day 1 Prasadam Recipe : దసర నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో అలంకరణ చేసి.. ఒక్కోరకమైన టేస్టీ వంటకాలను నైవేద్యంగా పెడతారు. అలా మొదటిరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని పెడతారు. దీనినే పరమాన్నం (Paramannam Recipe)అనికూడా అంటారు. ఇది అంటే అమ్మవారికి మహాప్రీతి అట. మరి ఈ టేస్టీ క్షీరాన్నాన్ని ఎలా తయారు చేయాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు 


బియ్యం - ముప్పావు కప్పు


సగ్గు బియ్యం - పావు కప్పు


పాలు - 5 కప్పులు 


నీళ్లు - 2 కప్పులు


బెల్లం - ఒకటిన్నర కప్పులు


నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు


జీడిపప్పు - 15


ఎండుద్రాక్ష - 10


కొబ్బరి ముక్కలు - గుప్పెడు


యాలకుల పొడి - అర టీస్పూన్


తయారీ విధానం


ముందుగా బియ్యం, సగ్గుబియ్యం కలిపి వాటిని బాగా కడిగి నానబెట్టాలి. అవి ఓ గంట నానితే సరిపోతుంది. మీరు సగ్గుబియ్యం వద్దు అనుకుంటే కప్పు నిండుగా బియ్యం తీసుకోవాలి. వాటిని కూడా ఇలాగే నానబెట్టుకోవాలి. గంట తర్వాత మందపాటి కడాయి లేదా గిన్నె తీసుకుని దానిని స్టౌవ్​పై వెలిగించి పెట్టాలి. దానిలో కాస్త నీళ్లు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు అడుగుపట్టకుండా ఉంటాయి. బియ్యాన్ని ఏ కప్పుతో కొలిచామో.. అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఒక కప్పుకి 5 కప్పుల పాలు వేసుకోవాలి. అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి. పాలు చిక్కగా పాయసం రుచి బాగుంటుంది. అలాగే మీరు నీళ్లు వద్దనుకుంటే కేవలం పాలతోనే దీనిని వండుకోవచ్చు. 


పాలు మరిగేలోపు మరో స్టౌవ్ వెలిగించాలి. దానిపై కడాయి పెట్టి బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది. దానిలో అరకప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను మీడియంలో ఉంచి దానిని బాగా మరిగించుకోవాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. బెల్లం పాకాన్ని మలినాలు లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పాలు కూడా పూర్తిగా కాగిపోతాయి. ఇప్పుడు వాటిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసి కలపాలి. 


మంటను తగ్గించి అన్నాన్ని ఉడికిస్తే నిదానంగా ఉడుకుతుంది. మూతపెడితే అన్నం మంచిగా ఉడుకుతుంది. అలాగే మీరు దగ్గర్లోనే ఉంటారనుకుంటే మంటను మీడియంలో చేసి ఉడికించుకోవచ్చు. మధ్యమధ్యలో రైస్​ని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగుపడుతూ ఉంటుంది. ఇలా అన్నం పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించుకోవాలి. అన్నం పాలల్లో కలిసి చిక్కగా మారుతుంది. ఇప్పుడు దానిలో యాలకుల పొడి వేసి కలిపి స్టౌవ్​ని ఆపేయాలి. 



ఇప్పుడు అదే రైస్​లో ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా చల్లారాలి. లేదంటే రైస్ విరిగిపోతుంది. అన్నంలో బెల్లం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నకడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని నెయ్యితోపాటు క్షీరాన్నంలో వేసేయాలి. అంతే టేస్టీ టేస్టీ క్షీరాన్నం రెడీ. ఈ నవరాత్రుల్లో దీనిని అమ్మవారికి మొదటిరోజున దీనిని చేసి నైవేద్యంగా పెట్టేయండి. సాధారణ రోజుల్లో కూడా ఈ టేస్టీ క్షీరాన్నం లేదా పరమాన్నం చేసి పెట్టేయొచ్చు.  



Also Read : దసరా సమయంలో అమ్మవారికి చిట్టిగారెలు ఎందుకు పెడతారో తెలుసా? ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే