Dussehra 2024 Day 3 Special Allam Garelu Recipe : దసరాల్లో అమ్మవారి అలంకరణకు తగ్గట్లు కొందరు నైవేద్యాలు చేస్తూ ఉంటారు. అలా మూడోరోజు అంటే అక్టోబర్ 5వ తేదీన శనివారం అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అన్నపూర్ణ దేవికి భక్తులు ఇష్టంతో అల్లం గారెలు చేసి పెడతారు. ఇంతకీ అమ్మవారికోసం చేసే ఈ అల్లం గారెలను ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


మినపప్పు - కప్పు


పచ్చిమిర్చి - 2


అల్లం - 1 అంగుళం


కరివేపాకు - 1 రెబ్బ


కొత్తిమీర - కొంచెం 


ఉప్పు - రుచికి తగినంత 


అటుకుల పొడి - 2 టేబుల్ స్పూన్లు


నూనె - డీప్​ ఫ్రైకి సరిపడేంత


తయారీ విధానం


ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారెలు చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే మినపప్పు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పును ఉదయాన్నే బాగా కడిగి శుభ్రం చేయాలి. అనంతరం దానిని గ్రైండర్​లో లేదా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. పిండిలో నీరు వేయకుండా పిండిని రుబ్బుకోవాలి. మధ్యలో కాస్త నీళ్లు చల్లి పిండిని గారెల కోసం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. పిండి పూర్తి అయిన తర్వాత దానిని బాగా ఒక డైరక్షన్​లోనే కలిపాలి. ఇలా మూడు నాలుగు నిమిషాలు పిండిని బాగా కలిపి దానిని ఓ పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి. 


ఈలోపు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినప పిండిని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో కాస్త ఉప్పు, పచ్చిమిర్చి తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అయితే ఈ పిండిలో కాస్త వంటసోడా, అటుకుల పొడి కూడా వేసుకోవాలి. పొట్టు మినపప్పుతో చేసుకుంటే దీనిని వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్ని బాగా మిక్స్​ అయ్యేలా గారెల పిండిని కలిపి సిద్ధం చేసుకోవాలి. 



ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచాలి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడేంత నూనె వేసి మీడియం మంట మీద ఉంచాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత చేతులకు కాస్త నీటిని అద్దుకుని.. పిండిని గారెలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి. గారెలు వేసే సమయానికి నూనె వేడిగా ఉంటేనే గారెలు బాగా వస్తాయి. లేదంటే నూనెలో తేలకుండా అడుగున అంటుకుపోతాయి. ఇలా వేసిన గారెలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి అల్లంగారెలు రెడీ. 



అమ్మవారికి పూజచేసుకునేప్పుడు ఈ అల్లం గారెలను నైవేద్యంగా పెట్టొచ్చు. అయితే ఇది కేవలం మూడోరోజే పెట్టాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి కూడా వీటిని నవరాత్రుల్లో ఏదొక రోజు చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చు. పండుగల సమయంలోనే కాకుండా నార్మల్ డేస్​లో కూడా ఈ అల్లం గారెలు చేసుకుని లాగించేయవచ్చు. ఇవి హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దసరాలో మీరు కూడా ఈ టేస్టీ అల్లం గారెలు రెడీ చేసేయండి. 


Also Read : అమ్మవారికి రెండో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ కొబ్బరి అన్నం రెసిపీ