Dussehra 2024 Day 2 Special Recipe : శరన్నవరాత్రుల్లో రెండో రోజు అక్టోబర్ 4వ తేదీన వస్తుంది. దసరా నవరాత్రుల్లో (Dussehra 2024) భాగంగా అమ్మవారు రెండో రోజు శ్రీ గాయత్రి దేవీ రూపంలో భక్తులకు కనిపిస్తారు. అమ్మవారి అవతారాలకు తగ్గట్లే భక్తులు కూడా వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే శరన్నవరాత్రుల్లో రెండో రోజు కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైద్యంగా చేసి పెడతారు. మరి ఈ టేస్టీ కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి తురుము - 1 కప్పు
బియ్యం - 1 కప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 1 స్పూన్
పల్లీలు - 20
శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
జీడిపప్పు - 20
ఎండుమిర్చి - 2
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా ఓ కొబ్బరికాయ నుంచి కొబ్బరిపాలు తీసుకోవాలి. కొబ్బరిని మిక్సీ వేసి.. దానిలో కాస్త నీరు వేసి దానిని పిండి కొబ్బరి పాలు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే మరో కొబ్బరిని తురిమి కొబ్బరి అన్నం కోసం సిద్ధం చేసుకోవాలి. ముందుగా బియ్యాన్ని తీసుకుని వండుకోవాలి. కొబ్బరి పాలు అందుబాటులో లేకుంటే నీళ్లతోనే కొబ్బరి అన్నాన్ని వండుకోవచ్చు. ఉంటే మాత్రం బియ్యాన్ని బాగా కడిగి.. దానిలో నీళ్లకొలతల్లో భాగంగా ఓ గ్లాసు కొబ్బరిపాలు.. మిగిలిన నీరు వేసి ఉడికించుకోవచ్చు.
కొబ్బరిపాలతో ఉడికించిన అన్నం మహా రుచిగా ఉంటుంది. వీలైనంత వరకు కొబ్బరిపాలను వేయడం మరచిపోకండి. రైస్ ఉడికే సమయంలో కాస్త ఉప్పు వేసి కలిపితే రుచి మరింత బాగుంటుంది. ఇప్పుడు మరో స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి పెట్టండి. తాళింపు కోసం నూనెను వాడుకోవచ్చు. కానీ ప్రసాదం గురించి చేసేప్పుడు నెయ్యి వాడితే మంచిది.
ఇప్పుడు కడాయిలో నెయ్యి వేయండి. దానిలో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో జీడిపప్పులు వేయాలి. జీలకర్ర కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. దానిలో ఆవాలు వేసి.. అవి వేగిన తర్వాత చిటెకుడు ఇంగువ వేయాలి. కరివేపాకు కూడా వేసి అన్ని బాగా కలిసిన తర్వాత దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి తురమును వేసి కలపాలి. తాళింపు కొబ్బరిలో బాగా కలిసిపోవాలి.
కొబ్బరి నుంచి మంచి అరోమా వస్తున్నప్పుడు ముందుగా వండుకున్న అన్నాన్ని దీనిలో వేయాలి. కొబ్బరి, అన్నం పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అమ్మవారికి నచ్చే.. అందరూ మెచ్చే కొబ్బరి అన్నం రెడీ. దీనిని రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా చాలామంది పెట్టుకుంటారు. మరికొందరు తొమ్మిదిరోజుల్లో ఏదొక రోజు దీనిని చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ నైవేద్యాన్ని అమ్మవారికి దసరా సందర్భంగా చేసి పెట్టేయండి. కొబ్బరిపాలు అందుబాటులో లేకపోతే కొబ్బరి తురుమును తాళింపుగా వేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు.
Also Read : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి