దయ్యాలు ఉన్నాయా? 
మీరెప్పుడైనా చూశారా? 
వీటికి సమాధానం ఒకేలా రాదు. మనిషిమనిషికి మారిపోతుంది.  
లేవని చెప్పిన వారు ఉన్నారు, ఉన్నాయని చెప్పిన వారు ఉన్నారు. కానీ తామిచ్చిన సమాధానానికి సాక్ష్యాలు మాత్రం ఎవ్వరూ చూపించలేరు. అందుకే దయ్యాలతో రిలేట్ అయిన కథలన్నీ మిస్టరీలుగా మిగిలిపోతాయి. అలాంటి ఒక మిస్టరీయే ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ఇలాంటి మిస్టరీలు బాగా నచ్చుతాయి. మనదేశంలో మిస్టిరియస్ ప్రదేశాల్లో ‘డుమాస్ బీచ్’ కూడా ఒకటి. 


గుజరాత్‌లోని సూరత్ సిటీని అనుకుని అరేబియన్ సముద్రం వెంబడి పరుచుకుని ఉంది డుమాస్ బీచ్. ఈ బీచ్ గురించి ఎన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పగలు ఆ బీచ్ కి వెళతారు కానీ, ఎవరూ సాయంత్రం దాటాక మాత్రం అడుగుపెట్టరు. దానికి కారణం డుమాస్ బీచ్ తిరగడం అంత సురక్షితం కాదనే అభిప్రాయం ప్రజల్లో ఉండడమే. బీచ్‌లో ఇసుక నల్లగా ఉంటుంది. అందుకే ఆ బీచ్ ను చూస్తేనే కాస్త భయమేస్తుంది. అందుకే ఇండియాలోని భయపెట్టే ప్రదేశాల్లో డుమాస్ బీచ్ పేరు వినిపిస్తుంది. 


ఎందుకు భయం?
ఉదయం అంతా ప్రశాంతంగా ఉండే డుమాస్ బీచ్, సాయంత్రం అయ్యాక మాత్రం కాస్త భయపెట్టేలా ఉంటుందట. సాయంత్రం దాటుతున్నకొద్దీ ఆ ప్రదేవం దెయ్యాల దిబ్బలా కనిపిస్తుందట. బీచ్ లో నడుస్తున్నవారి చెవుల్లో గాలి హోరుతో పాటూ గుసగుసలు వినిపిస్తుంటాయి. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎవరూ కనిపించరు. దెయ్యాలే మాట్లాడుకుంటున్నాయనే ప్రచారం జరిగింది. అప్పట్నించి సాయంత్రం దాటితే ఆ పక్కకి పోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. పగలు మాత్రం ఈ దెయ్యాల బీచ్ ని, నల్ల ఇసుకని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.


ఒకప్పుడు...
ఈ బీచ్ చుట్టూ ఒక కథనం ప్రజల్లో అల్లుకుంది. ఒకప్పుడు ఆ బీచ్ హిందూ శ్మశన వాటిక అని చెప్పుకుంటారు. బీచ్ కింద ఎన్నో అస్థిపంజరాల గుట్టలు ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇది శ్మశాన వాటిక కాబట్టే ఇక్కడి ఇసుక నల్లగా మారిపోయిందనే వాదన కూడా ఉంది. అక్కడ అంత్యక్రియలు  నిర్వహించినా వారి ఆత్మలు ఇంకా బీచ్లోనే తిరుగుతున్నాయిన చెప్పుకుంటారు. అవే గుసగుసలాడుతూ ఉంటాయని, ప్రజలను ఆ శబ్ధాలతో భయభ్రాంతులను చేస్తాయని అంటుంటారు. బీచ్ కు దగ్గర్లో నివసించేవారు, రాత్రిపూట అటుగా వెళ్లేవారు తమకు చాలా అరుపులు, శబ్ధాలు వినిపించేవని చెబుతున్నారు. అంతేకాదు ఓసారి ఒక వ్యక్తి బీచ్లోనే హత్యకు గురయ్యాడని కూడా చెప్పారు. దీంతో దయ్యాలే అతడిని చంపాయనే కథనం కూడా పుట్టుకొచ్చింది. కొందరు మనుషులు ఆ బీచ్ లో మిస్సయిన సంఘటనలు కూడా జరగడంతో ప్రజలు మరింతగా దెయ్యాల కథనాలను నమ్మసాగారు. 


ఆ ప్రాంతంలోని కుక్కలు రాత్రయ్యాక బీచ్ లో అడుగుపెట్టవు. సరికదా చాలా విచిత్రంగా బీచ్ ను చూసి ప్రవర్తిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. భయంతో అరవడం, దూరంగా పారిపోవడం వంటివి చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం డుమాస్ బీచ్ సాయంత్రం దాటాక ఒంటరిగా ఉంటుంది. ఉదయం మాత్రం అని బీచ్ ల మాదిరిగా సందడిగా మారిపోతుంది. 


Also read: అలాంటివారికి గుండెపోటు వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, కొత్త అధ్యయన ఫలితం



Also read: నిద్రలో మాట్లాడడం కూడా ఒక రోగమే, వారసత్వంగా వచ్చే అవకాశం