దుబాయ్ నగరంలో ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టులు కొత్తేమీ కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా నిర్మించి అబ్బుపర్చింది అక్కడి ప్రభుత్వం. పామ్ జుమేరాను పూర్తి చేసి నిర్మాణ రంగంలో సత్తా చాటుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ లాంటి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో అద్భుత ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మూన్ స్టైల్ రిసార్ట్ ను నిర్మించబోతుంది. ఇప్పటికే ఈ రిసార్టుకు సంబంధించిన నమూనాను కెనడియన్ ఆర్కిటెక్చరల్ కంపెనీ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఇంక్ (MWR) విడుదల చేసింది.
ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే?
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బటయకు వస్తున్నాయి. దీని నిర్మాణం 735 అడుగుల (224 మీ) ఎత్తును కలిగి ఉండబోతుంది. 10 ఎకరాలు లేదంటే 4,35,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో చంద్రుడి ఆకారంలో నిర్మాణం జరగబోతుంది. ఇందులో హోటల్ గదులు, వెల్నెస్ సెంటర్, నైట్ క్లబ్, మీటింగ్ హాల్, మూన్ షటిల్ సహా అనేక ప్రత్యేకతలు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. మూన్ థీమ్ తో భూమ్మీద విలాసాలను అందిచబోతుంది. అంతేకాదు.. ఈ ప్రదేశం అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని సమాచారం. అంతరిక్ష సంస్థలు తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు వేదికగా ఉంటుందని అరేబియన్ బిజినెస్ తన నివేదికలో వెల్లడించింది.
ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ల అంతరిక్ష ఔత్సాహికులను ఆకర్షిస్తుందని అంచనా వేసింది. సూపర్‌స్ట్రక్చర్ కు సంబంధించిన డిస్క్ భవనాల లోపల ప్రైవేట్ నివాసాలపై ఆసక్తి ఉన్న వారికి 300 స్కై విల్లాలను కూడా అందిస్తుంది. మూన్ వరల్డ్ రిసార్ట్స్ యొక్క ఫేస్ బుక్పేజీ ప్రకారం, ప్రతి లగ్జరీ యూనిట్ 2,000 చదరపు అడుగుల (186 sq. m) విస్తీర్ణంలో ఉంటుంది. దాని యజమానులకు మూన్ ఓనర్స్ క్లబ్‌లో జీవితకాల సభ్యత్వం ఉంటుంది.
రిసార్ట్ ఎప్పుడు నిర్మిస్తారు?
ఈ మూన్ థీమ్ విల్లాకు సంబంధించి మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఇంక్ నిర్మాణ సంస్థ పేటెంట్ రైట్స్ ఇప్పటికే తీసుకుంది. 2023లో ఈ సంస్థ ప్రాంతీయ లైసెన్సుదారు కోసం ఈ మోడల్ ను ప్రదర్శించడానికి ప్రపంచ వ్యాప్త రోడ్‌షో కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రోడ్ షోలో భాగంగా.. దుబాయ్ తో పాటు మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఒకే ప్రాంతీయ లైసెన్స్‌ని అందించిన తర్వాత నిర్మాణానికి కచ్చితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ఒక సంవత్సరం ప్రీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత 48 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ నిర్మాణం 5- స్టార్ బిల్ట్ అవుట్ స్టాండ్, 5 డైమండ్ రిసార్ట్ ఆపరేషనల్ స్టాండర్డ్స్, తో పాటు గోల్డెన్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంటుంది.
మరో మూడు ప్రాంతాల్లో నిర్మాణం!
MENA ప్రాంతం కాకుండా, MWR మరో మూడు మూన్ థీమ్డ్ రిసార్ట్ లకు లైసెన్స్ ఇవ్వాలని భావిస్తోంది. వీటిలో ఒకటి ఉత్తర అమెరికాలో, మరొకటి ఐరోపాలో, ఇంకొకటి ఆసియాలో ఇవ్వబోతున్నది.