డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎన్ని పోషకాలను అందిస్తాయో, ఎంత బలమో అందరికీ తెలిసిన విషయమే. కానీ పిల్లలు కొన్ని రకాల నట్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా చిక్కీ చేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి తియ్యగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు కాబట్టి, పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. 


కావాల్సిన పదార్థాలు
బాదం పప్పులు - పదిహేను
జీడిపప్పులు - పది
పిస్తా పప్పులు - పది
గుమ్మడి గింజలు - మూడు స్పూన్లు
ఎండు నల్ల ద్రాక్షలు - పది
నువ్వులు - నాలుగు స్పూన్లు
బెల్లం తురుము - ఒక కప్పు
నీళ్లు - సరిపడా
నెయ్యి - ఒక చెంచా


కావాల్సిన పదార్థాలు
1. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, ఎండు నల్లద్రాక్షలు సన్నగా తరుక్కోవాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి డ్రై ఫ్రూట్స్‌ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 
3. ఇప్పుడు అదే కళాయిలో ఒక చెంచా నెయ్యి వేయాలి. అందులో ఒక కప్పు బెల్లం, కాస్త నీరు వేసి బాగా కలుపుకోవాలి. 
4. బెల్లం పాకం వచ్చేలా తయారయ్యాక అందులో ముందుగా వేయించిపెట్టుకున్న నట్స్ తో పాటూ, వేయించిన నువ్వులు, గుమ్మడి గింజలు కూడా వేసి బాగా కలపాలి. 
5. ఒక పళ్లానికి అడుగున నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. 
6. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలుగా చాకుతో కోసి, ఎండాక ముక్కలు తీసి ఒక డబ్బాలోదాచుకోవాలి. అంతే పోషకాల చిక్కీ రెడీ అయినట్టే.  


చలికాలంలో డ్రైఫ్రూట్స్ తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కాలంలోనే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆ శక్తి పెరుగుతుంది. ఈ సీజన్లో వచ్చే ఎన్నో అనారోగ్యాలకు ఇవి చెక్ పెడతాయి. ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ అధికంగా ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణను, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. మహిళలు వీటిని తినడం చాలా ముఖ్యం. వీరిలోనే రక్తహీనత అధికంగా కనిపిస్తుంది. అందుకే పిల్లలు, మహిళలు తినాల్సిన అవసరం ఉంది. డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. అజీర్తిని రాకుండా అడ్డుకుంటుంది. వీటిని రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. వీటిలో ఉండే కొవ్వులు, ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు ఇవి చాలా అవసరం. జుట్టు ఊడిపోవడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరడతాయి. 


Also read: రాత్రిపూట ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువే


Also read: అధికంగా ఉడికించడం వల్ల కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయా? ఇందులో నిజమెంత?