బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా తక్కువ కెలోరీలు ఉండే ఆహారాన్ని ఎంచుకుంటారు. ఇది మంచిదే కానీ ఆహారం కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాదు పానీయాలు కూడా అందులోకి వస్తాయి. చాలా మంది ఘన రూపంలో ఉన్న ఆహారం పైనే దృష్టి పెడతారు కానీ, తాగే పానీయాల గురించి పట్టించుకోరు. అవి కూడా బరువు పెరగడంలో కొంత పాత్ర పోషిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహారనిపుణులు.
ప్యాక్డ్ పండ్ల రసాలు
పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవి మనకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ను అందిస్తాయి. నిజమే కానీ అవన్నీ అందేవి తాజాగా అప్పటికప్పుడు పండ్లను రసం తీసి తాగితే, కానీ ప్యాక్ చేసి బయట అమ్మే పండ్ల రసాల వల్ల మాత్రం నష్టమే ఎక్కువ. వాటిలో స్వీట్ నెస్ కోసం పంచదారను అధికంగా కలుపుతారు. వాటిని తాగడం వల్ల బరువు ఇంకా పెరుగుతారు కానీ తగ్గే అవకాశం తక్కువ. వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది.
స్వీట్ టీ
గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి హెర్బల్ టీలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. స్వీట్ టీ, ఐసుముక్కలు వేసుకుని తాగే స్వీట్ ఐస్ టీ వంటివాటి వల్ల ఉపయోగం లేదు. మార్కెట్లో కూడా ప్యాక్ట్ టీలు దొరుకుతున్నాయి. అవి తాగితే 200 నుంచి 450 కెలోరిలు శరీరానికి అందుతాయి. తీపిదనం లేని టీని ఇంట్లోనే చేసుకుని తాగాలి.
ఎనర్జీ డ్రింక్స్
మార్కెట్లో ఎన్నో రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది చెమటలు కారేలా వ్యాయామం చేసి తరువాత ఎనర్జీ డ్రింకులను తాగుతారు. దీనివల్ల వ్యాయామంలో మీరు ఖర్చు చేసిన కెలోరీలన్నీ ఈ డ్రింకు వల్ల తిరిగి శరీరాన్ని చేరుకుంటాయి. ఈ డ్రింకుల్లో షుగర్, ఫ్లేవర్లు ఉంటాయి. కనుక వ్యాయామం చేసిన వెంటనే కొబ్బరి నీళ్లు లేదా తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.
ఆల్కహాల్
బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా దూరం పెట్టాల్సిన పానీయం ఆల్కహాల్. ఇందులో కెలోరిల సంఖ్య అధికంగా ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ లో కూల్ డ్రింకులు కలుపుకుని తాగుతారు. అప్పుడు కెలోరీల సంఖ్య ఇంకా పెరుగుతుంది. కనుక ఆల్కహాల్ కు దూరంగా ఉండడం ఉత్తమం.
తగినంత నీరు శరీరానికి అందకపోయినా ప్రమాదమే. రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడానికి ప్రయత్నించండి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు
Also read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
Also read: రోజుకో గ్లాసుడు రాగి జావ తాగండి.. వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం తగ్గుతుంది