భారతదేశంలో అత్యవసర సమయాల్లో లేక సర్జరీల సమయంలో మార్పిడి కోసం సురక్షితమైన రక్తం డిమాండ్ సరఫరాను మించిపోయింది. స్వచ్ఛంద రక్తదానం  ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలి. దాని ద్వారా సోషల్ అవేర్‌నెస్ పెంచడం ద్వారా రక్తదానం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా ఉండే ఉద్యోగస్తులకు రక్తదానం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అపోహలను తొలగించడం

రక్తం దానం చేయడం వల్ల బలహీనంగా అవుతారు లేదా అలసిపోతారని చాలా మంది అనుకుంటారు. ఆరోగ్యవంతులైన పెద్దలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 3 నుంచి 4 నెలలకు ఒకసారి 350- 450 ml వరకు రక్తం దానం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, కోల్పోయిన రక్తం దాదాపు 48 గంటల తర్వాత తిరిగి పొందుతారు. అదే విధంగా ఎర్ర రక్త కణాలు 3-4 వారాలలోపు తిరిగి ఉత్పత్తి అవుతాయి. అరుదైన రక్త రకాలు ఉన్నవారు మాత్రమే రక్తం దానం చేయాలనేది మరో అపోహ. వాస్తవానికి, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.95 మిలియన్ యూనిట్ల రక్త లోటు కనిపిస్తోంది. ఇది అన్ని రక్త రకాల రక్తవర్గాల వారిపై ప్రభావం చూపుతుంది. దీనిని అధిగమించడానికి, ఆరోగ్యవంతులైన దాతలు క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలలకు ఓసారి రక్తదానం చేయడం ముఖ్యం. 

పనిలో ఇది ఎందుకు ముఖ్యం

జాబ్ చేసేవారు వర్క్ డెడ్ లైన్స్, ముఖ్యమైన మీటింగ్స్ టెన్షన్ ఎదుర్కొంటుంటారు. కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడుపుతున్న వారికి రక్తదానం ఒక చురుకైన "ఆరోగ్య పరీక్ష"గా చెప్పవచ్చు. రక్త దానం చేయడానికి ముందు దాతను పరీక్షిస్తారు. రక్తపోటు(BP)తో పాటు హిమోగ్లోబిన్, మీ హెల్త్ కండీషన్‌కు సంబంధించి అందరు దాతలకు స్క్రీనింగ్ చేస్తారు. దాంతో మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా రక్త దాతల ఆరోగ్య స్థితి గురించి తెలుస్తుంది.

క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిలను తగ్గించవచ్చు. తద్వారా ఇది కొన్ని రకాల గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 2019లో ది ఏషియన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సైన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పదేపదే రక్తదానం చేసేవారిలో ఐరన్ తగినంత మోతాదులో ఉంటుంది. రక్తదానం వల్ల ఒకరి మానసిక స్థితి పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది. 2022లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రక్తదాతలకు ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. అధిక పని ఒత్తిడి ఉండే చోట ఉద్యోగులకు బ్లడ్ డొనేషన్ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పనిచేసే చోట బ్లడ్ డొనేషన్

తమ కార్యాలయంలో సంస్థల నిర్వాహకులు రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు ఉద్యోగులకు, సిబ్బందికి బ్లడ్ డొనేషన్‌పై అవగాహన పెంచాలి. చిన్న ప్రోత్సాహకాలు అందించడం ద్వారా సంస్థలు ఉద్యోగుల ఆరోగ్యంలో తమ వంతు పాత్ర పోషించవచ్చు. 

డాక్టర్ శాంతను ధారి , HCL హెల్త్‌కేర్‌లో సీనియర్ మేనేజర్ (వైద్య సేవలు)

[నోట్: వైద్యుల భాగస్వామ్యంతో ఈ కథనంలో సాధారణ సమాచారం అందించాం. ఇది వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఏదైనా అనారోగ్యం, సమస్యలపై ఏవైనా సందేహాలుంటే డాక్టర్2ను సంప్రదించి వారి సలహా తీసుకోండి.]