హైదరాబాద్: దేశవ్యాప్తంగా 11 ఏండ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తున్నది. మరో 11 ఏండ్లు పరిపాలించేందుకు ప్రజల మద్దతుతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాడు యూపీఏ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాకిస్తాన్ ఎన్ని ఉగ్రదాడులు చేసిన భారత్ భరించాల్సి వచ్చేది. కానీ తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రదాడులు జరిగితే క్యాండిల్స్​వెలిగించేవాళ్లం. లాబీలు పెట్టే వాళ్లం. ఇప్పుడు పాక్ నుంచి ఒక్క డ్రోన్​ వచ్చినా.. భారత్​ నుంచి హైదరాబాద్‌లో తయారైన బ్రహ్మోస్​క్షిపణి దూసుకొస్తదని హెచ్చరించారు.

యూపీఏ హయాంలో అవినీతి, కుంభకోణాలే..

సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో.. మొట్టమొదటి కాంగ్రెస్సేతర ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఏ హయాంలో.. పేపర్, టీవీల్లో ప్రతిరోజూ కుంభకోణాలే కనిపించేవి. ఎటు చూసినా అవినీతి వార్తలే. దేశంలో అవినీతి ప్రభుత్వం, కీలు బొమ్మ ప్రభుత్వం ఉండకూడదని   2014లో దేశ ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీని గెలిపించారు. గత 11 ఏళ్ల పాలనలో ఎక్కడా అవినీతి వార్తలు లేవు. ప్రధాని మోదీ పారదర్శక పాలనను అది అద్దం పడుతోంది. 

 మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి సైతం దుర్వినియోగం చేయలేదు. ఆనాడు మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది. నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో.. గ్రామాల్లో స్వచ్ఛభారత్​ టాయిలెట్​ నుంచి చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే వరకు ప్రతి రంగంలో ప్రగతి సాధించాం. గతంలో పాకిస్తాన్​ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా భారత్‌లో అన్ని నగరాల్లో ఐఎస్​ఐ ఏజెంట్లను పెట్టుకునేది. హైదరాబాద్​నగరంలో సహా, పోలీస్ అధికారులపై తీవ్రవాదులు దాడులు చేశారు. దిల్‌సుఖ్​ నగర్, గోకుల్​చాట్​సహా నగరంలో 3 చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. పాక్ ఉగ్రదాడులు చేస్తే భరించడం తప్పా, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏమీ చేయలేని దుస్థితిలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. 

మోదీ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్..

ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదుపై ప్రతీకారంగా సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​ స్ట్రైక్స్ చేశాం. ఆపరేషన్​ సింధూర్​ లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది బీజేపీ ప్రభుత్వం. ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా మన సైనికులు ఆపరేషన్​సింధూర్ ను సక్సెస్​చేశారు. హైదరాబాద్ నుంచి.. ఎక్కడికెళ్లినా ప్రపంచస్థాయి రోడ్లు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలైతే చాలా తక్కువ సమయంలో 32 జిల్లాల్లో రోడ్లను జాతీయ రోడ్లకు అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు నిధులు, మహిళా సంఘాలకు లోన్లు జీపీలకు నిధులు, భారత దేశంలో నేషనల్​ హైవేల నిర్మాణం జరిగింది. 

తెలంగాణలో 1.50 లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఆధునీకరిస్తున్నాం. కాంగ్రెస్​పాలనలో ఒక్క రైల్వే స్టేషన్​ ను కూడా డెవలప్​ చేయలేదు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అత్యద్భుతంగా నిర్మిస్తున్నాం. విదేశీ ఎగుమతులు, ఐటీ, డిఫెన్స్​ ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో భారత్​పోటీ పడుతోంది. భారత్​బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ దేశాలు ఏ సమావేశం నిర్వహించినా.. భారత ప్రధాని మోదీని తొలి వరుసలో చూసే స్థాయికి భారత్​ ఎదిగింది. 

కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఈరోజు వరకు కూడా ఉచిత రేషన్​ ఇస్తున్నాం. 140 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్​ఇచ్చాం . త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం బారినపడి బలైంది. ధనికరాష్ట్రం లక్షల కోట్ల అప్పులపాలైంది. దాంతో కేసీఆర్​ ను వద్దనుకొని ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, దళితులు ఇలా అందర్నీ మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణకు మేలు జరగాలంటే... అమరుల త్యాగాలు ఫలించాలంటే ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీతోనే సాధ్యం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం’ అని కిషన్ రెడ్డి అన్నారు.