అందంగా కనిపించేందుకు అనేక రకాల స్కిన్ కేర్ క్రీములు ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉన్న క్రీములు కూడా ఉంటాయి. వాటిని నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల మంట, చికాకు తగ్గుతుంది. కానీ వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అతిగా వినియోగించడం వల్ల కొన్ని సార్లు శాశ్వత గుర్తులు, మచ్చలు పడే అవకాశం ఉంది. కొన్ని సార్లు చర్మం రంగు కూడా మారే అవకాశం ఉందని చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.


స్టెరాయిడ్స్ రోగనిరోధక శక్తిని తగ్గించే ఇమ్యునోసప్రెసెంట్ డ్రగ్. చర్మం మంట, చికాకు వంటి ఇతర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే వాటిని తగ్గించేందుకు స్టెరాయిడ్స్ సూచిస్తారు. కానీ ఇది శాశ్వత చికిత్స కాదని నిపుణులు వెల్లడించారు. స్టెరాయిడ్స్ వాడకాన్ని నిదానంగా, వీలైనంత తొందరగా మానేయాలి. అకస్మాత్తుగా స్టెరాయిడ్స్ ఆపేస్తే మంట, చర్మం మీద ముడతలు వల్లి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్టెరాయిడ్స్ వాడకంపై శ్రద్ధ, జాగ్రత్త అవసరం.


స్టెరాయిడ్స్ చర్మంలో రెండు రూపాలలో ఉపయోగించబడుతున్నాయి. ఒకటి ఓరల్, టాపికల్. టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అనేడి వాపు, చికాకుని తగ్గించేందుకు నేరుగా చర్మానికి రాసుకునే ఒక రకమైన ఔషధం. ఇవి విరివిగా దొరుకుతాయి. కొన్ని క్రీముల్లో కూడా స్టెరాయిడ్స్ మిశ్రమాలు ఉంటాయి.


స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు


ఎవరైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు ఉపయోగిస్తే అవి తగ్గించేందుకు బదులుగా చికాకు, మంట పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా శరీరం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడదు. స్టెరాయిడ్స్  ఎక్కువగా ఉన్న క్రీములని నిరంతరం వాడుతూ ఉండటం వల్ల తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్న కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని చర్మ వ్యాధి నిపుణులు వెల్లడించారు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయడం వల్ల చర్మం దెబ్బతినడం జరిగి అనేక దుష్ప్రభావాలకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.


ఓవర్ ది కౌంటర్ డ్రగ్ గా విక్రయించబడుతున్న స్టెరాయిడ్ లతో కూడిన స్కిన్ క్రీమ్ లని చర్మ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ముఖంపై క్రీమ్ రూపంలో ఉండే స్టెరాయిడ్స్ వల్ల మొహం ఎర్రగా మారిపోవడం, జుట్టు రాలిపోవడం చర్మం మీద మంట వంటి సమస్యలని సృష్టిస్తుంది. అందుకే ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. అందం కోసం మార్కెట్లో దొరికే వాటన్నింటినీ కొనుగోలు చేసి ఉపయోగించడం వల్ల లేనిపోని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.


అందుకే వైద్యుల సలహా లేకుండా ఎటువంటి స్టెరాయిడ్స్ ఉండే క్రీములు వినియోగించకూడదు. వాటిని అతిగా వాడటం వల్ల చర్మం పిగ్మెంటేషన్ కు గురవుతుంది. దీని వల్ల మొహం మీద మొటిమల సమస్య అధికం అవుతుంది. మళ్ళీ వాటిని తగ్గించుకునేందుకు ఇతర క్రీమ్స్ ఉపయోగించాలి. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా సహజ సిద్ధమైన అందం పొందేందుకు ప్రయత్నించాలి. పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటూ చక్కగా నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల చర్మం సహజ కాంతిని సంతరించకుంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే దోమలు పరార్!