ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మళ్ళీ ఆడవారికి చేయించే మగవారు ఎంతోమంది. ఇలా డెలివరీలు, ఆపరేషన్లతో మహిళల శరీరం నీరసపడిపోతుంది. అందుకే మగవారికి కూడా వాసెక్టమీ అనేది అమల్లోకి వచ్చింది. అంటే కుటుంబ నియంత్రణను ఆపరేషన్ మగవారికి చేస్తారన్నమాట. అయితే ఇప్పటికీ కూడా వాసెక్టమీ చేయించుకోవడానికి ముందుకు వచ్చే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. విదేశాల్లోని మగవారు ముందడుగు వేస్తున్నప్పటికీ, మనదేశంలోని మగవారు మాత్రం ఇప్పటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధ్యతను మహిళలపైనే పెడుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం 2018 నుంచి 2019 మధ్య 5 కోట్లకు మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే వీరిలో మూడు శాతం మంది మాత్రమే మగవారు. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మగవారు వాసెక్టమీ చేయించుకుంటున్నా... భారత్ లాంటి దేశాల్లో మాత్రం ఇంకా ఈ ఆపరేషన్ విషయాల్లో అనేక సందేహాలు ఉన్నాయి.


వాసెక్టమీ అంటే...
వాసెక్టమీ అనేది ఒక చిన్న సర్జరీ. పురుషుల వృషణాల్లో వీర్యాన్ని మోసుకెళ్ళే నాళాలు ఉంటాయి. వాటిలో ఒక నాళాన్ని కట్ చేస్తారు. ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వ్యక్తి మేల్కొనే ఉంటాడు. కేవలం సర్జరీ చేసే ప్రాంతంలో మాత్రమే మత్తు ఇస్తారు. ఈ ఆపరేషన్ పూర్తవడానికి పావుగంట పడుతుంది. ఈ ఆపరేషన్ 99% కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే మగవారిలో చేయించుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే అపోహ ఉంది. దాన్ని వైద్యులు కొట్టి పడేస్తున్నారు. వాసెక్టమీకి,  లైంగిక ఆసక్తికి,  లైంగిక శక్తికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వీర్యకణాలు ఎప్పటిలాగానే ఉత్పత్తి అవుతూనే ఉంటాయని,లైంగికాసక్తి తగ్గడం వంటివి జరగవని వివరిస్తున్నారు. అయితే వృషణాల్లో ఉత్పత్తి అయిన వీర్యకణాలు వీర్యంతో కలవవు. ఎందుకంటే వీర్య కణాలను వీర్యంలో కలిపే నాళాన్నే ఆపరేషన్ చేసి కట్ చేస్తారు. కాబట్టి అవి శరీరంలోని ఇతర ద్రవాల్లో కలుస్తాయి. అంటే సెక్స్ చేసే సమయంలో వీర్యకణాలు, మహిళల శరీరంలోకి ప్రవేశించవు. దీనివల్ల గర్భం దాల్చే అవకాశం పూర్తిగా ఉండదు. 


మగవారు వాసెక్టమీ చేయించుకున్నాక రెండు రోజుల పాటూ కాస్త నొప్పిగా ఉంటుంది. ఆ తరువాత ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. ఎలాంటి సందేహాలు, భయాలు లేకుండా మగవారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఈ ఆపరేషన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. కాబట్టి మగవారు వాసెక్టమీ చేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దు.


Also read: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనదిగా అధికారికంగా గుర్తింపు తెచ్చుకున్న ఆకుకూర ఇదే



Also read: చింత చిగురు కారం పొడి ఇలా చేసుకున్నారంటే రుచి అదిరిపోవడం ఖాయం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.