ఓ మహిళ కంటి కింద చిన్న మచ్చ కనిపించింది. ఎన్నో ఏళ్లుగా ఆ మచ్చ ఆమెని ఇబ్బంది పెట్టింది. ఏమిటా అని తెలుసుకునేందుకు హాస్పిటల్ కి వెళ్ళగా వైద్యులు విస్తుపోయే విషయం చెప్పారు. అది ప్రపంచంలోని అతి చిన్న చర్మ క్యాన్సర్ గా గుర్తించారు. దాని పరిమాణం కేవలం 0.65 మిల్లీ మీటర్లు లేదా 0.025 అంగుళాలు మాత్రమేనని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ(OHSU) చర్మ వ్యాధి నిపుణుల బృందం కనుగొంది. హైటెక్ నాన్ ఇన్వెసివ్ టెక్నాలజీ సహాయంతో ఈ చిన్న క్యాన్సర్ ని కనుగొన్నారు. ఈ మచ్చ చర్మ క్యాన్సర్ రకం మెలనోమాగా నిర్థారించారు.


చర్మాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకుండానే 


నాన్ ఇన్వాసివ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల క్రిస్టి స్టాట్స్ అనే మహిళ చెంప మీద కంటి కింద భాగంలో క్యాన్సర్ స్పాట్ ని గుర్తించారు. సాంకేతికత సహాయంతో చర్మం కత్తిరించకుండానే దీన్ని కనిపెట్టారు. ఈ మెలానోమా ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్. ఇవి ప్రస్తుతం ఒక భాగంలో మాత్రమే ఉన్నాయి. ఇతర భాగాలకు వ్యాపించకపోవడం వల్ల చికిత్స చేయడం సులభమవుతుందని నిపుణులు తెలిపారు.


గిన్నిస్ రికార్డు


ప్రపంచంలోనే అతి చిన్న చర్మ క్యాన్సర్ ని కనుగొనందుకు ఓఎస్ హెచ్ యు వైద్యులు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. మే 1 వ తేదీన గిన్నీస్ అధికారులు పరీక్ష జరిపిన వైద్య బృందంలో ప్రతీ ఒక్కరికీ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.


ఇలా కనిపెట్టారు


ప్రపంచంలోనే అతి చిన్న క్యాన్సర్ ని కనిపెట్టేందుకు చర్మాన్ని కత్తిరించకుండా అధునాతన టెక్నాలజీతో గుర్తించారు. డెర్మోస్కోప్, రిఫ్లెక్టెన్స్ కాన్ఫోకల్ మైక్రోస్కోపీ అనే ఇమేజింగ్ సాధనంతో ఈ క్యాన్సర్ మచ్చని కనిపెట్టారు. చర్మాన్ని గాయపరచకుండా పరీక్షించేందుకు వైద్యులకు సహాయపడే ఒక ఇమేజింగ్ సాధనం ఇది. చిన్న క్యాన్సర్ ని గుర్తించేందుకు ఇది ఉపయోగపడింది. OHSU స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలెగ్జాండర్ విట్కోవ్స్కీ, అతని సహచరులు జోవన్నా లుడ్జిక్, జినా చుంగ్, సాన్సీ లీచ్‌మన్, క్లాడియా లీ చిన్న క్యాన్సర్‌ను గుర్తించడంలో పాల్గొన్నారు.


బాధిత మహుళ క్రిస్టి స్టాట్స్ ముఖంపై చాలా కాలం పాటు ఎర్రటి మచ్చ ఉండేది. ఆమె అది ఎందుకు అలా వచ్చిందో తెలుసుకునేందుకు చాలా మంది చర్మ వ్యాధి నిపుణులను సందర్శించింది. కానీ పరీక్షించిన వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పారట. దీంతో ఆమె వైద్యులను కలవడం మానేసింది. అయితే ఒక రోజు మరొక డెర్మటాలజిస్ట్ అలెగ్జాండర్ ని కలిసింది. ఆమెకి పరీక్షలు జరపగా ఆ మచ్చ క్యాన్సర్ అని గుర్తించారు. సరైన సమయంలో క్యాన్సర్ మచ్చని గుర్తించడంతో చికిత్స చేయడం సులభం అయ్యింది.


మెలనోమా అనేది శరీరం అంతటా వ్యాపించే ఒక అత్యంత తీవ్రమైన చర్మకేన్సర్. చర్మం పైన, చర్మం కింది పొరల్లో ఈ క్యాన్సర్ పెరుగుతుంది. దీనికి మొదటి దశలోనే చికిత్స చేయించుకోవాలి, లేకపోతే ఇతర అవయవాలకు చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉంది. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే మెలనోమాలు క్యాన్సర్ కణజాలాన్ని పూర్తిగా తొలగించడం సులభం. చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ,  టార్గెటెడ్ థెరపీ వంటివి చేస్తారు. 


Also Read: రోజుకొక తమలపాకు నమిలితే ఆ రోగాలేవీ మీ దరిచేరవు