సాధారణంగా ఎవరికైనా బాగా కోపంగా ఉన్నప్పుడు పళ్ళు కోరుకుతారు. కానీ కొంతమందికి మాత్రం నిద్రలో తమకి తెలియకుండానే పళ్ళు బిగించి కటకటామని కొరికేస్తూ ఉంటారు. దీన్ని వైద్యపరిభాషలో బ్రక్సిజం అంటారు. ఇది ఆరోగ్యానికి అంతగా హాని కలిగించదు కానీ కాలక్రమేణా దంతాలు దెబ్బతినొచ్చు. తలనొప్పికి కారణమవుతుంది. నోటి సమస్యల్ని కూడా సృష్టిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పళ్ళు కొరకడం అనేది ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన కారణంగా సంభవిస్తుంది. దంతాలు వంకరగా ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. సక్రమంగా నిద్రలేకపోవడం, స్లీప్ అప్నియా వంటి రుగ్మతల వల్ల ఇది వస్తుందని చాలా మంది వైద్యులు భావిస్తున్నారు.
బ్రక్సిజం వల్ల కలిగే ఇబ్బందులు
⦿ నిద్రకి భంగం కలగడం
⦿ దంతాలు వదులుగా మారడం, పళ్ల మీద ఎనామిల్ అరిగిపోవడం
⦿ పంటి నొప్పి లేదా సెన్సిటివిటీ
⦿ దవడ కండరాలు బిగుసుకుపోవడం
⦿ దవడ, మెడ, ముఖంలో నొప్పి
⦿ చెవి నొప్పి
⦿ తలనొప్పి
⦿ ఆహారం నమలడంలో ఇబ్బంది
ఈ సమస్యని అధిగమించడం ఎలా?
పళ్ళు కొరకడం అనేది సాధరణంగా తీసుకునే విషయం కాదు. ఇది పెద్దగా హాని కలిగించదు కానీ సమస్య నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవాలి. నిద్రలో పళ్ళు కొరక్కుండా ఉండేందుకు దంత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అవసరమైతే మౌత్ గార్డ్ అమర్చాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవాలి.
⦿ పళ్ళు కొరకడానికి కారణం నిద్రలేమి అయితే వైద్య నిపుణులని సలహాలు తీసుకోవాలి. మెరుగైన నిద్రకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
⦿ కోలాస్, కాఫీ, చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు, పానీయాలు నివారించడం మంచిది.
⦿ పళ్లకి గట్టిగా ఉండే కఠినమైన ఆహార పదార్థాలు తీసుకోవడం నివారించాలి.
⦿ నమలడానికి కష్టంగా ఉండే ఇతర జిగట ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి.
⦿ నిద్ర సక్రమంగా పట్టడం కోసం నిద్రపోయే భంగిమ మార్చుకోవాలి.
⦿ మెడ ఎత్తుగా ఉంచుకునేందుకు తల దిండు ఉపయోగించడం మంచిది.
⦿ మనం పడుకునే విధానం కూడా నిద్రకి ఆటంకం కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండటంలో నిద్రాభంగిమ కూడా చాలా ముఖ్యం.
⦿ పళ్ళు కొరకడం వల్ల వచ్చే నొప్పులని తగ్గించడం కోసం హాట్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ ఉపయోగించాలి.
⦿ ఆల్కాహాల్ మానుకోవాలి. ఇది పళ్ళు కోరికే అలవాటుని తీవ్రతరం చేస్తుంది.
⦿ పెన్సిళ్లు లేదా పెన్నులు వంటి వాటిని నమలకూడదు. ఎందుకంటే ఇది దవడ కండరాలు మరింత బిగించేలా చేస్తుంది.
⦿ పళ్ళు కొరకాలనే ఆలోచన రాకుండా ఏదో వ్యాపకం మీద దృషి మరల్చాలి.
⦿ దవడ కండరాలు రిలాక్స్ గా ఉండేలా చేసుకోవాలి.
పదే పదే పళ్ళు కొరకడం వల్ల తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. దాన్ని భరించడం చాలా కష్టం. అందుకే వీలైనంత త్వరగా ఆ అలవాటు నుంచి బయటపడేలాగా చికిత్స తీసుకోవాలి. లేదంటే చూసేందుకు చిన్నగానే కనిపించే ఈ పని వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: యువతలో మధుమేహం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!