ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోయినా ఆ ప్రభావం మరుసటి రోజు కనిపిస్తుంది. సరిగా పనిచేయలేము, చీటికి మాటికి విసుగు కోపం వచ్చేస్తాయి.అందుకే తగినంత నిద్ర అవసరమని చెబుతారు వైద్యులు. అయితే మగవారితో పోలిస్తే మహిళలకు మరింత నిద్ర అవసరమని చెబుతున్నారు. జీవశాస్త్ర పరంగా పురుషఉలు, మహిళలు భిన్నమైన శారీరక అవసరాలు ఉంటాయి.పురుషుల కంటే మహిళలకు ఎక్కువ విశ్రాంతి అవసరం. ఒక స్త్రీ మెదడు వారి రోజువారీ కార్యకలాపాల వల్ల కలిగిన అలసట నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమని ఒక అధ్యయనం తేల్చింది. స్త్రీలకు నిద్రసరిపోనప్పుడు వారిలో బాధ, కోపం అధికంగా కలుగుతుంది. అందుకే మహిళలు పురుషుల కన్నా ఎక్కువ సమయం నిద్రపోవాలి. ఎందుకో మరిన్ని కారణాలు ఉన్నాయి చదవండి.
బిజీ షెడ్యూల్ వల్ల
పురుషులతో పోలిస్తే మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఉద్యోగం, వంటపనులు, ఇంటిపనులు, పిల్లలు... ఇన్నీ బాధ్యతలు మోయడం వల్ల వారు అధికంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకునే సమయం కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఆఫీసుకు నుంచి వచ్చాక కూడా వారికి విశ్రాంతి లేకుండా రాత్రి భోజనం సిద్ధం చేస్తారు. దీని వల్ల వారు తీవ్రంగా అలసటకు గురవుతారు. అలాంటి వారికి ఎక్కువ విశ్రాంతి చాలా అవసరం. లేకుంటే హారనికరమైన మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఊబకాయం
పురుషులతో పోలిస్తే స్త్రీలు బరువు తగ్గడం కష్టం. బరువు త్వరగా పెరుగుతారు కానీ త్వరగా తగ్గరు. మహిళలు తగినంత నిద్ర లేకపోయినా బరువు త్వరగా పెరుగుతారు. దీని వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఆకలిని పెంచి, ఊబకాయం బారిన పడేలా చేస్తుంది.
హార్మోన్లలో మార్పులు
మహిళల్లో నిద్రలేమి వల్ల హార్మోన్లలో తీవ్ర మార్పులు కలుగుతాయి. ఇది ఆరోగ్యం చాలా ప్రభావం కలుగుతుంది. గర్భం ధరించడం, రుతు క్రమం వంటివి కష్టంగా మారుతాయి. శారీరక అసౌకర్యం, నొప్పులు, మెదడు చంచలంగా మారడం వంటివి జరుగుతాయి. వీరిలో మానసిక ఆందోళన, నిరాశ వంటివి కలుగుతాయి. అందుకే ఎక్కువ నిద్రపోవడం అవసరం.
మెదడుకు విశ్రాంతి
ఒకరోజులో ఒక మహిళ చేసే పనులు ఎన్నో. మెదడు ఆ పనుల గురించి ఆలోచిస్తూ చాలా బిజీగా మారిపోతుంది, చివరికి అలసిపోతుంది. అందుకే రాత్రిపూట మహిళలు అధిక సమయం నిద్రపోవాలి. అప్పుడు మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు మంచి నిద్ర లేనప్పుడు ఇంట్లో చికాకులు, గొడవలు కూడా ఎక్కువవుతాయి.
అధిక రక్తపోటు
మహిళలు తాము విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల వారిలో అధిక రక్తపోటు పెరుగుతుంది. ఇలా జరగడం వల్ల సి రియాక్టివ్ ప్రొటీన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల రక్తపోటు పెరిగి గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
Also read: మొక్కజొన్న గింజల దోశ, అప్పుడప్పుడు తింటే ఎంతో బలం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.