పూర్వం ఎన్నో రకాల కూరగాయలను తినేవాళ్ళం. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. అలా వాడకంలో అంతరించిపోయిన కూరగాయల్లో ఇవీ ఒకటి. గ్రామీణులకు ఇవి బాగా తెలుస్తాయి. వీటిని కాసర కాయలు అంటారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. గ్రామాల్లో రోడ్ల వెంబడి తీగలుగా పాకిన మొక్కలకు ఈ కాసరకాయలు కాస్తాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో చిన్న కాకరకాయలు అని పిలుచుకుంటారు. చూడటానికి కూడా కాకరకాయల్లాగే ఉంటాయి. కాకపోతే పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. ఈ కాకరకాయలను వర్షాకాలంలో కచ్చితంగా తినాలి. సీజనల్ అంటువ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఇవి ముందుంటాయి. ఇప్పుడు పట్టణాల్లోని ఏ మార్కెట్లలో కూడా కాసరకాయలు కనిపించడం లేదు. ఇవి తినాలంటే కేవలం గ్రామీణ ప్రాంతాలకే వెళ్లాలి.
కాసరకాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయలు ఎంత మేలు చేస్తాయో, కాసరకాయలు కూడా మన శరీరానికి అంతే మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు నిండి ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కూడా లభిస్తాయి. మన శరీరానికి అవసరమైన కాల్షియం, బీటాకేరాటిన్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, జింక్ వంటి ఎన్నో పోషకాలు దీనిలో ఉన్నాయి. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు వీటిని కచ్చితంగా తినాలి. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బరువు కూడా పెరగకుండా ఉంటారు. ఈ కాసరకాయలు తినడం వల్ల ఎముకలు, దంతాలు కూడా బలంగా ఉంటాయి.
గుండె సమస్యలు ఉన్నవారు కాసరకాయలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. గుండెకు బలం లభిస్తుంది. ఎలాంటి గుండె సమస్యలు లేని వారు కూడా కాసరకాయలను తింటే ఎంతో మంచిది. గుండె ఆరోగ్యానికి ఇది రక్షణ కల్పిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కూడా వీటిలోని పోషకాలు కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, జ్వరాలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అందుకే ఇవి ఈ వర్షాకాలంలోనే లభిస్తాయి. మహిళలు, పిల్లలు ఎంతోమంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కాసరకాయలను తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. రక్త వృద్ధి పుష్కలంగా జరుగుతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాసరకాయలు తినడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. చర్మ సౌందర్యానికి కూడా ఈ కాసరకాయల కూర సహాయపడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. కాసరకాయలతో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. వేపుళ్ళు, కూర వండుకోవచ్చు. అలాగే వెల్లుల్లి వేసి కారం తయారు చేసుకోవచ్చు. కాబట్టి కాసరకాయలు కనిపిస్తే కచ్చితంగా కొనుక్కొని వెళ్ళండి. సీజనల్ పండ్లు, కూరగాయలు ఏవైనా ఆయా సీజన్లలో కచ్చితంగా తినాలి.
Also read: వానాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయ కాంటోలా, అదేనండి ఆకాకరకాయ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.