వేసవికి సిద్ధమవుతున్నారా? మార్చి నుంచే వేడిమి తాలూకు దెబ్బ తగులుతోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సీజన్‌కు తగ్గట్టు మన అలవాట్లు, పద్ధతులు కూడా మారాల్సిందే. లేకుంటే ఆరోగ్యసమస్యలు రాక తప్పవు.వేసవిలో వదిలేయాల్సిన అలవాట్లు ఇవే.
చల్లని పానీయాలు
ఎండాకాలం అనగానే కూల్ డ్రింకులు, జ్యూసులు, ఎనర్జీ డ్రింకులు తెగ తాగేస్తారు చాలా మంది. ఎండలోనుంచి వస్తే చాలు వెంటనే ఒక బాటిల్ చల్లని డ్రింకులో పొట్టలో పడాల్సిందే. కానీ ఇది చాలా చెడు అలవాటు. వేసవిలో ఇది మీకు మేలు చేయదు. ఆ డ్రింకులలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది అనేక రోగాలకు కారణం అవుతుంది. దాహం కూడా పెరిగిపోతుంది. వేసవిలో కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం మంచిది.
సన్ స్క్రీన్ లోషన్
చాలా మంది సన్ స్క్రీన్ లోసన్ వాడరు. శీతాకాలం అయితే మాయిశ్చరైజర్ వాడినట్టే వేసవిలో కచ్చితంగా బయటికి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. ఇది మీ చర్మాన్ని హానికర కిరణాల నుంచి కాపాడడమే కాదు, తేమగా ఉంచుతుంది. మొటిమలు, వడదెబ్బకు చర్మం కమలడం, చర్మ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి ఇది కాపాడుతుంది.
కవర్ చేసుకోవాల్సిందే..
చాలా మంది స్లీవ్ లెస్ డ్రెస్సులతో వేసవిలో తిరుగుతుంటారు. నిజానికి ఎర్రటి ఎండలో ముఖం నుంచి చేతుల వరకు ఏదైనా వస్త్రంలో కవర్ చేసుకోవడం చాలా మంచిది. చర్మం ఎంతగా తీవ్రమైన సూర్య కిరణాల వేడిమికి గురవుతుందో అక్కడ కణాలు అంతగా దెబ్బతింటాయి. సాధారణ వేడిని చర్మ కణాలు తట్టుకోగలవు కానీ, వేసవిలో మండే ఎండలను తట్టుకోలేవు.
నిద్ర
వేసవిలో సాధారణంగానే పగలు పెరిగి, రాత్రి తగ్గుతుంది. దీని వల్ల చాలా మంది నిద్రను కూడా తగ్గించుకుంటారు. కానీ అలా చేయడం తప్పు. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందే. నిద్రకు సీజన్‌తో సంబంధం లేదు. నిద్ర తగ్గితే ఏ కాలమైనా కూడా శరీరం నీరసంగా మారుతుంది. చురుకుదనం తగ్గుతుంది.
వ్యాయామం
చెమట పట్టేస్తుందని చెప్పి చాలా మంది వేసవిలో వ్యాయామం చేయరు. ఒక అయిదు పదినిమిషాలు చేసి ఆపేస్తారు. కానీ వ్యాయామం వేసవిలో కూడా కచ్చితంగా చేయాల్సిందే. వేడి, చెమటను కారణాలుగా చూపించి వ్యాయామం ఆపితే శారీరకంగా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేస్తే బరువు పెరగకుండా, చురుకుగా ఉంటారు.
Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే