కలలు వెంటాడని మనిషి ప్రపంచంలో ఉండడేమో. ఒక్కో మనిషికి ఒక్కో కల. మెలకువ వచ్చేసరికి కొన్ని కలలు మర్చిపోతాం, అస్సలు గుర్తుండవు. కానీ కొన్ని మాత్రం ఆ రోజంతా గుర్తుకొస్తూనే ఉంటాయి. అవి అంతగా మనల్ని ఆందోళనలకు గురి చేస్తాయి. కొన్ని కలలకు ఇక్కడ అర్ధాలు ఇచ్చాం. మీకు అలాంటి కలలు వచ్చాయేమో ఓసారి చూసుకోండి. 


1. ఎలాంటి దుస్తుల్లేకుండా నలుగురిలో నిల్చున్నట్టు కొందరికి కల వస్తుంది. దానికర్థం మీరు ఏ విషయానికో మీకు తెలియకుండానే భయపడుతున్నట్టు లెక్క. ఒక విషయాన్ని బయటికి చెప్పేందుకు భయపడుతున్నారేమో అని అర్థం చేసుకోవాలి. 


2. నోట్లోని దంతాలన్నీ రాలిపోయినట్టు కలొస్తే మీ వ్యక్తిగత శక్తిని (Personal Power) మీరు కోల్పోతున్నారని ఏ మూలో మీరు ఫీలవుతున్నట్టు.  


3. మీరు చనిపోయినట్టు లేదా ఎవరైనా చనిపోయినట్టు కలొస్తే భయపడకండి. అది మీలోని మార్పుకు భయపడే లక్షణం. కల రూపంలో మీకు తెలిసింది అంతే. 


4. ఎవరో ఒకరు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తే అది మీలో పోస్ట్ ట్రామా (Post trauma)కు సంకేతం. ఏదైనా పెద్ద విషాదం లేదా ఆరోగ్య పరిస్థితి నుంచి తేరుకున్నాక ఇలాంటి ఏర్పడేదే పోస్ట్ ట్రామా. అదే ఏదైనా జంతువు వెంటాడుతున్నట్టు అనిపిస్తే మీ మనసులోని ఫీలింగ్స్ మీరు బయటపడకుండా దాచేస్తున్నట్టు లెక్క. 


5. ఎత్తు నుంచి పడిపోతున్నట్టు కలొస్తే మీరు తాజాగా తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల విషయంలో రెండో సారి ఆలోచించాలని అర్థం. 


6. ఏదో పరీక్ష రాస్తున్నట్టు కలొస్తే మీకు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడుతున్నటు అర్థం చేసుకోవాలి. 


7. గర్భవతి అయినట్టు కలొస్తే మీరు ఆనందించాల్సిందే. మీ జీవితంలో మంచి అభివృద్ధి జరుగబోతోందని తెలుసుకోవాలి.


8.  జీవితభాగస్వామి మిమ్మల్ని మోసం చేసినట్టు కలొస్తే మాత్రం ఏదో విషయం జరుగబోతోంది, మీరు అలెర్ట్‌గా ఉండాలని సూచన కావచ్చు. 


9. ఎవరైనా సెలెబ్రిటీని కలిసినట్టు కలొస్తే... మీకు వారిపట్ల ఇష్టం ఉన్నట్టు లెక్క. అదే మెదడులో పాతుకుపోయి కలల రూపంలో వచ్చి ఉండొచ్చు. 
 
కలలు కనేది ఆ సమయంలోనే...
ర్యాపిడ్ ఐ మూమెంట్ (రెమ్) ఇదే మనకు కలల వచ్చే నిద్రావస్థ. ఇది తక్కువ సమయం పాటూ కలుగుతుంది. మనం ఎనిమిది గంటలు నిద్రపోతే అందులో 90 నిమిషాల పాటూ రెమ్ పరిస్థితి కలుగుతుంది. రెమ్ కలిగే సమయంలో మనం వేకువగా ఉన్నట్లే అనిపిస్తుంది, కళ్లు వేగంగా కదుపుతాం. మన శరీరం ఆలోనియా అనే అచేతనస్థితిలో ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో మనకు కలలు వస్తుంటాయి. కలలు కనే సమయంలో మెదడులోని కోర్టెక్స్, లింబిక్ సిస్టమ్ అనే ప్రాంతాలకు రక్త ప్రసరణ కూడా అధికంగా జరుగుతుంది. కలలు రావడానికి కారణాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. వాటిని కంట్రోల్ చేయడం కూడా కష్టమే.