రిటైల్ స్టోర్లు, దుకాణాలకు వెళ్లినప్పుడు కొంతమంది కొన్ని ఉత్పత్తులు దొంగిలిస్తుంటారు. అలా ప్రపంచంవ్యాప్తంగా ఉన్న లక్షల స్టోర్ల నుంచి రోజూ అనేక ఆహారాలు దొంగతనానికి గురవుతుంటాయి. ఏ ఆహారాన్ని అధికంగా ఎత్తుకెళుతున్నారో తెలుసా? చాలా మంది చాక్లెట్లు, బిస్కెట్లు అనుకుంటారు. కానే కాదు... అది చీజ్. ది గార్డియన్ మీడియా చెప్పిన ప్రకారం చీజ్ ప్రపంచవ్యాప్తంగా అధికంగా దొంగతనానికి గురవుతోంది. ఓసారి ఓ షాపు నుంచి ఏకంగా కోటి 20 లక్షల రూపాయలు విలువైన చీజ్‌ను రాత్రికి రాత్రే కొంతమంది దుండుగులు ఎత్తుకెళ్లారు. వారి ఆచూకీ చెప్పిన వారికి మూడు లక్షల 75 వేల రూపాయలు పారితోషికంగా ఇస్తానని ప్రకటించారు ఆ షాపు యజమాని.
సర్వే చెప్పిందిదే
బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ రిటైల్ రీసెర్చ్ వారు 43 దేశాల్లోని రెండున్నర లక్షల రిటైల్ అవుట్‌లెట్లకు చెందిన 1187 మందిని సర్వే చేశారు. వారంతా చాక్లెట్లు, ఆల్కహాల్ కంటే కూడా చీజ్ అధికంగా దొంగతనానికి గురవుతున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న చీజ్‌లో నాలుగు శాతం మేర దోపిడీకి గురవుతోంది. అందుకే రిటైలర్లు ప్రత్యేకంగా చీజ్‌ను కాపాడుకోవాల్సి వస్తోంది.
చీజ్ మాత్రమే ఎందుకు?
చీజ్‌ను చాలా మంది ధనవంతుల ఆహారంగా భావిస్తారు. చాలా వంటల్లో దీన్ని భాగం చేసుకోవచ్చు. ముఖ్యం పాశ్చాత్య దేశాల్లో దీని వాడకం ఎక్కువ. అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే చీజ్‌ను బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముతారక్కడ. అధిక ధర పెట్టి కొనడం ఇష్టంలేని వాళ్లు దాన్ని దొంగిలించేందుకు సిద్ధమవుతున్నారు.
చీజ్ రుచి కూడా...
దీని రుచి మామూలుగా ఉండదు. పిచ్చా, బర్గర్, సాండ్ విచ్, చీజ్ బ్రెడ్, టాకోస్, రోల్స్... ఇలా చాలా ఆహారపదార్థాలకు చీజ్ మంచి జత. అందులోనూ పాశ్చాత్యదేశాల్లో తినే వంటకాలన్నీ ఇవే కాబట్టి చీజ్ వారికి రోజూ అవసరం పడుతుంది. దాని వల్లే ఇది మోస్ట్ వాంటెడ్ ఫుడ్‌గా మారింది. చీజ్ వల్లే కలిగే ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే.
ఆరోగ్యప్రయోజనాలు అధికమే...
చీజ్‌ను అధికంగా తీసుకుంటే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అదే మితంగా తింటే మాత్రం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలకు, దంతాలకు చాలా మంచిది. పిప్పి పళ్ల సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. చీజ్ లో సోడియం ఉంటుంది. ఇది గుండె ఒత్తిడిని నియంత్రిస్తుంది. హైబీపీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. చీజ్ తరచూ తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ. కొలన్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్... మొదలైనవి రాకుండా అడ్డుకునే గుణాలు చీజ్‌లో ఉన్నాయి.