శరీరంలో చేరిన వ్యర్థాలను ఫిల్టర్ చేసే బాధ్యత కిడ్నీలదే. అవి సరిగా పనిచేస్తేనే మన శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్ తీవ్రంగా ఉండడం వంటి సమయాల్లో మాత్రం మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు అవి శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించలేవు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే... ఆ విషయం మనకు శరీరం కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మాత్రం తేలికగా తీసుకోవద్దు. 


1. పాదాల వాపు 
శరీరంలో అధికంగా ఉన్న సోడియంని బయటికి పంపించడంలో మూత్రపిండాలదే ప్రధాన పాత్ర. కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయలేకపోతే శరీరంలో సోడియం పేరుకుపోతుంది. దీనివల్ల మోకాలి చిప్పలు, పాదాలు పొంగినట్టు వాచిపోతాయి. దీన్నే ఎడెమా అని కూడా పిలుస్తారు. కళ్లు చుట్టు వాపు, ముఖం పొంగినట్టు కావడం కూడా గమనించవచ్చు. 


2. నీరసం
నిత్యం అలసిపోయినట్టు నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఆ వ్యక్తి మరింత బలహీనంగా మారిపోతాడు. ఇంటి పనులు, నడవడం కూడా కష్టంగా మారతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోయి ఇలా జరుగుతుంది. 


3. ఆకలి ఉండదు
కిడ్నీలు సరిగా పనిచేయని వ్యక్తుల్లో ఆకలి తగ్గిపోతుుంది. కారణం శరీరంలో టాక్సిన్స్, వ్యర్థాలు అధికంగా చేరిపోయి ఆకలి వేయదు. అంతేకాదు బరువు కూడా పెరిగిపోతారు. ఉదయాన లేచాక వాంతులు, వికారం వంటి లక్షణాలు కూడా కలుగుతాయి. తిన్నా, తినకపోయినా పొట్ట నిండిన ఫీలింగే కలుగుతుంది. 


4.  అతి తక్కువగా లేదా అతి ఎక్కువగా మూత్రానికి వెళ్లడం
ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఆరు నుంచి 10 సార్లు మూత్రానికి వెళతాడు. కిడ్నీలు సరిగా పనిచేయని వ్యక్తులు మాత్రం అతి తక్కువగా లేదా అతి ఎక్కువగా మూత్రానికి పోతుంటాడు. అంతేకాదు మూత్రంలో రక్తం కనిపించే అవకాశాలు కూడా ఎక్కువే. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తకణాలు మూత్రంలోకి రావడం మొదలవుతుంది. 


5. పొడి చర్మం, దురదలు
కిడ్నీలు పనిచేయని వ్యక్తులలో చర్మం పొడి బారుతుంది. దురదలు కూడా కలుగుతాయి. ఎప్పుడైతే శరీరం నుంచి టాక్సిన్లు బయటికి పంపడంలో కిడ్నీలు విఫలమవుతాయో ఆ టాక్సిన్లు రక్తంలో చేరుతాయి. అప్పుడు చర్మం పొడిబారి, దురదగా అనిపించడం మొదలవుతుంది.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Read Also: కాఫీని ఇలా తాగితే బరువు తగ్గిపోతారు... ప్రయత్నించండి


Read Also: నందిత బన్నా... శ్రీకాకుళం అమ్మాయి మిస్ సింగపూర్ అయింది, మిస్ యూనివర్స్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి